రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆక్సిజన్ తయారీ, బాటిలింగ్ యూనిట్ల ప్రారంభం
రాష్ట్రంలోనే మోర్తాడ్ సీహెచ్‌సీలో మొదటి ప్లాంట్ ఏర్పాటు
బాల్కొండ నియోజకవర్గానికి 102 ఆక్సిజన్ బెడ్లు
ఐసీయూ బెడ్లు, మానిటర్లు, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు
‘పదవిలో ఉండడం గొప్పకాదు. కానీ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకోసం ఏం చేశామన్నదే పాయింట్’ అని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ తయారీ ప్లాంటు, బాటిలింగ్ యూనిట్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని, ఆర్మూర్, బోధన్ దవాఖానల్లో 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు.
మోర్తాడ్, ఆగస్టు 25: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా లేని విధంగా మోర్తాడ్ సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ…తన మిత్రుల సహకారంతో మోర్తాడ్ సీహెచ్‌సీలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్, నియోజకవర్గంలోని రెండు సీహెచ్‌సీల్లో ఐదు చొప్పున మోర్తాడ్ ప్రభుత్వ దవాఖానలో నాలుగు ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. 102 బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని, ఆర్మూర్, బోధన్ ఏరియా దవాఖానల్లో 10 ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో అనేక మందికి సకాలంలో ఆక్సిజన్ అందక, ఆక్సిజన్ బెడ్లు దొరక్క ప్రాణాలు కోల్పోయారని, ఇంత జరుగుతున్నా మనం ఏం చేయలేమా అనే మేథోమథనం నుంచే ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలన్న సంకల్పం ఏర్పడిందని చెప్పారు. అందుకోసం మిత్రుల ద్వారా రూ.కోటి సేకరించి కలెక్టర్‌కు ఇచ్చామన్నారు. దీంతోపాటు ఆక్సిజన్ తయారీప్లాంట్, బాటిలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించుకొని మోర్తాడ్‌లో రూ.54లక్షలతో పూర్తి చేశామన్నారు. 102 ఆక్సిజన్ నింపే సిలిండర్లను సమకూర్చుకోవడమే మిగిలిందని, అది కూడా మరో 15రోజుల్లో పూర్తి చేస్తానని మంత్రి చెప్పారు. మోర్తాడ్ నుంచి బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని దవాఖానలకు ఆక్సిజన్‌ను సిలిండర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఏ ఒక్కరు కూడా ఆక్సిజన్ బెడ్ దొరక్క, ఆక్సిజన్ అందక అనే కారణాలతో మృత్యువును చేరవద్దని ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. మోర్తాడ్, బాల్కొండ ప్రభుత్వ దవాఖానల్లో గంటకు 100 లీటర్లు, మిగతా దవాఖానల్లో గంటకు 50లీటర్ల ఆర్వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి
పదవి ఇవాళ ఉంటుంది.. రేపు పోతుంది.. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ పదవి ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేశామన్నదే పాయింట్ అని మంత్రి అన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వ దవాఖానలో లేని విధంగా మోర్తాడ్ సీహెచ్‌సీలో మిత్రుల సహకారంతో ఆక్సిజన్ తయారీ, బాటిలింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. పదవుల్లో ఉన్నప్పుడు ప్రజల బాగు కోసం పని చేస్తే ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొవిడ్‌ను ఎదుర్కొనేలా చర్యలు తీసుకున్నారన్నారు.
రూ.54లక్షల చెక్కు అందజేసిన మంత్రి
మోర్తాడ్ సీహెచ్‌సీలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు కోసం పెట్టిన ఖర్చు నిమిత్తం రూ.54లక్షల చెక్కును కలెక్టర్ నారాయణరెడ్డికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను, జిల్లా దవాఖాన సూపరిండెంటెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, మోర్తాడ్ వైద్యులను, సిబ్బందిని అభినందించారు. ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌కు సంబంధించిన బాధ్యతలను మోర్తాడ్ సీహెచ్‌సీ డాక్టర్ సుమంత్‌కు అప్పగించారు.
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఆర్వో ప్లాంట్లు, మోర్తాడ్ సీహెచ్‌సీలో ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ఏర్పాటుకు సహకరించిన మిత్రులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. అనూష ప్రాజెక్ట్స్ రూ.25లక్షలు, ఎస్వీసీ కన్స్ట్రక్షన్స్ రూ.25 లక్షలు, కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.25లక్షలు, ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.44లక్షలు, సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ రూ.10లక్షలు అందజేశారని చెప్పా రు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఎల్పీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ బోగ ధరణి, ఎంపీటీసీ రాజ్‌పాల్, ఉపసర్పంచ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ పీహెచ్సీ పరిశీలన
వేల్పూర్, ఆగస్టు 25: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. దవాఖానలో తన స్నేహితుల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ బెడ్స్ పనులను పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ రమేశ్, డాక్టర్ అశోక్, సర్పంచ్ తీగల రాధ, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్ ఉన్నారు.