చెరువులు, వాగుల్లో నిండుగా నీరు
సకాలంలో వర్షాలతో రైతన్న హర్షం
వానకాలం పంటలకు ఢోకా లేదంటున్న అన్నదాతలు
మోర్తాడ్, ఆగస్టు 25 : వానలు సకాలంలో కురవక రైతన్నలు మొగులుకు ముఖం పెట్టుకునే వారు… వాన ఎప్పుడు కురుస్తుందా? అని ఎదురు చూసేవారు…కానీ అనుకున్న సమయానికి వర్షాలు కురిస్తే రైతుల్లో ఉండే సంతోషం అంతా ఇంతా కాదు. అదే పరిస్థితి ఈ సంవత్సరం చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా సమయానికి అనుకున్న దానికన్నా ఎక్కువే వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం పంటలకు ఢోకాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అలుగు పారిన చెరువులు
జూలైలో కురిసిన వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటల అలుగు పారాయి. ఆరేండ్ల పాటు అలుగు పారని మోర్తాడ్ ముసలమ్మ చెరువు అలుగు కూడా ఈసారి పారింది. ప్రతి చెరువు, కుంట భారీ వర్షాలతో నిండుకుండలా మారడంతో ఆయకట్టు ప్రాంతానికి సాగు కళ సంతరించుకున్నది. మండలంలో 49 చెరువులు, కుంటలు ఉండగా వీటి కింద 3,495 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు నిండుకుండల్లా మారడంతో ఆయకట్టు ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
వాగులకు జలకళ
మండలంలోని పెద్దవాగు, మోర్తాడ్ మొండివాగు, ధర్మోరా మొండివాగులు కూడా జలకళను సంతరించుకున్నాయి. పెద్దవాగులో నిర్మించిన గాండ్లపేట్, సుంకెట్, పాలెం వద్ద నిర్మించిన చెక్‌డ్యాముల వద్ద నీరు నిండి పొంగిపొర్లుతుంది. దీంతో ఈప్రాంతంలోని రైతుల సాగునీటికి ఢోకా లేదు. పెద్దవాగు నుంచి మోటార్ల ద్వారా వ్యవసాయానికి నీటిని తీసుకెళ్లారు. చెక్‌డ్యాముల వద్ద నీరు చేరడంతో సాగునీటి ఇబ్బందులు తప్పినట్లయ్యింది. మోర్తాడ్, సుంకెట్, ధర్మోరా గ్రామాల్లో వాగులో ఉధృతంగా నీరు ప్రవహించడంతో కొన్ని పంటలు దెబ్బతిన్నాయి.
భారీ వర్షాలతో ఊరట
గతంలో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పేవి కాదు. కానీ, ఈ సంవత్సరం జూన్, జూలైలో భారీ వర్షాలు కురవడంతో వర్షాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. గతేడాది జూన్ మాసంలో 148 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈ సంవత్సరం 203.7మి.మీలు, గత సంవత్సరం జూలై మాసంలో 260.7మి.మీల వర్షపాతం నమోదుకాగా ఈసంవత్సరం రికార్డు స్థాయిలో 717.5 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. జూలైలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, వాగులు నిండుకుండలా మారాయి.
చెక్‌డ్యాములతో ఎంతో ప్రయోజనం
పెద్దవాగులో చెక్‌డ్యాముల నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చెక్‌డ్యాముల వద్ద నీళ్లు నిండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతున్నది. దీంతో బోరుబావుల్లో నీరు పెరిగి రైతులకు సాగునీటి ఇబ్బందులు దూరమవుతున్నాయి. చెరువులు నిండడంతో ఆయకట్టుకు నీటి కొరత లేకుండా పోయింది.
-రవీందర్, రైతు పాలెం