పంచాయతీ చిన్న.. ‘ప్రగతి’లో మిన్న
పల్లె ప్రకృతివనంతో కళకళలాడుతున్న గ్రామం
లక్షల నిధులతో అభివృద్ధి పనులు
కోటగిరి, ఆగస్టు 25:
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని అడ్కాస్పల్లి గ్రామంలో అ భివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో ప్రజలకు అవసరమైన పనులు చేపడుతున్నారు. సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తున్నారు. విద్యుద్దీపాలతో వీధుల్లో వెలుగులు నిండాయి. పల్లె ప్రగతి పనులను పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకున్నది. జనాభా ప్రాతిపదికన నెలనెలా పంచాయతీకి విడుదలయ్యే రూ. 70 వేలను పాలకవర్గం సద్వినియోగం చేసుకొని గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పనులు వడివడిగా సాగుతున్నాయి.
డంపింగ్ యార్డు,
వైకుంఠధామం.. పల్లెప్రకృతి వనం
అడ్కాస్పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డును నిర్మించి, అందులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. రూ.6లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. ట్యాంకర్ ద్వారా హరితహారం మొక్కలకు నీరు పోస్తున్నారు. గ్రామ శివారులో రూ.12.65 లక్షలతో వైకుంఠధామం నిర్మించారు. రూ.2.45లక్షలతో కంపోస్టుషెడ్డు, ఎకరం స్థలంలో పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా గ్రామం లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.
గల్లీ గల్లీలో సీసీ రోడ్డు ఏర్పాటు
వర్షం కురిసిందంటే చాలు రోడ్లన్నీ బురదమయంగా మారేవి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా రూ. 10లక్షలతో సీసీ రోడ్లు వేశారు. రూ.9లక్షలతో సీసీ డ్రైనేజీలను నిర్మించారు. దీంతో రోడ్లన్నీ అద్దంలా మారాయి. దుమ్ము, ధూళి లేకుండా పరిశుభ్ర వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో 25 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి.
స్పీకర్ పోచారం సహకారంతో అభివృద్ధి
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేశాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్టు షెడ్డు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేప ట్టాం. ప్లాస్టిక్హ్రిత గ్రామంగా తీర్చిదిద్దడానికి తడి, పొడి చెత్త బుట్టలను అందించి చెత్త సేకరణ చేస్తూ శుభ్రంగా ఉంచుతున్నాం. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.