పదేండ్ల క్రితం గండిపడిన ముత్తకుంట చెక్డ్యాముకు మోక్షం
కంపా నిధుల కింద రూ. 6 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
పూర్తయిన చెక్‌డ్యాం పునరుద్ధరణ, అలుగు నిర్మాణం
అటవీ ప్రాంతంలోని జీవాలకు అందుబాటులోకి తాగునీరు
భూగర్భజలాల పెంపునకు దోహదం
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 21 : నిజామాబాద్ మండలంలోని ముత్తకుంట గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో అటవీ శాఖ అధికారులు 25 ఏండ్ల క్రి తం చెక్‌డ్యాం నిర్మించారు. 15 ఏండ్లపాటు అ టవీ జంతువులకు తాగు నీరందించిన చెక్డ్యాముకు పదేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు తోడు గుట్ట పైభాగం నుంచి వరద భారీగా రావడంతో గండి పడింది. దీంతో నీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొంది. అటవీ జంతువులకు ఇక తాగునీరు లభించడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో గండి పడిన చోట తాత్కాలికంగా పూడ్చినప్పటికీ మళ్లీ వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయే పరిస్థితి ఉండేది. చెక్ డ్యాం పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించారు. ఫలితంగా ప్రభుత్వం రూ. 6 లక్షలు కంపా నిధులు మంజూరు చేసింది.
పునరుద్ధరణ పనులతోపాటు అలుగు నిర్మాణం
ఈ ఏడు వేసవిలో రూ. 6 లక్షల వ్యయంతో 12 మీటర్ల పొడవు, 1.20 మీటర్ల వెడల్పు, 3 మీ టర్ల ఎత్తు ఉండేలా చెక్‌డ్యాం నిర్మించారు. అంతేగాకుండా అలుగు కూడా నిర్మించారు. దీని ద్వా రా గుట్ట పైభాగం నుంచి వరద ఉధృతి ఎక్కు వగా ఉన్నా అలుగు ద్వారా బయటికి వెళ్లడానికి వీలుంది. చెక్డ్యాముకు ఇక గండి ఏర్పడే అవకాశం లేకుండా అలుగు నిర్మాణం ఎంతగానో దోహదపడినట్లయింది.
గతంలో గ్రామం వరకు వచ్చిన జంతువులు..
చెక్డ్యాముకు గండి ఏర్పడడంతో నీరు నిల్వ లేకపోవడంతో తాగునీటి కోసం అడవి జంతువులు రాత్రి సమయంలో గ్రామం వరకు వచ్చేవి. గ్రామానికి ఆనుకొని నిజాంసాగర్ ప్రధాన కా లువ ఉన్నది. ఈ కాలువ అవతలి వైపున అటవీ ప్రాంతం ఉంది. కాలువ ప్రవహిస్తున్నప్పుడు రాత్రి సమయంలో అడవి జంతువులు నీరు తాగి వెళ్లేవని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో చిరుత పులులు ఐదారు సార్లు మేకలపై దాడి చేశాయి. దీంతో గ్రామస్తులు భయం తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెక్‌డ్యాం నిర్మాణంతో అడవి జంతువులన్నింటికీ తాగునీరు అందుబాటులోకి రావడంతో ఇక అవి గ్రా మ పొలిమేరల వరకు వచ్చే పరిస్థితి లేదు. దీం తో అడవి జంతువుల భయం నుంచి విముక్తి కలిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. దీనికి తోడు చెక్ డ్యాం నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ బోర్లలో నీరు పుష్క లంగా లభిస్తున్నదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముత్తకుంట – లింగి తండా
శివారులోనే అటవీ జంతువులు
నిజామాబాద్ నుంచి మోస్రా మీదుగా వర్నికి వెళ్లే మార్గమధ్యంలో మల్లారం గండి గుండా వా హనాలు రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో అడవి జంతువులు సంచరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వన్యప్రాణులు ము త్తకుంట – లింగి తండా గ్రామాల శివార్లలో ఉ న్న అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటున్నాయని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వేసవిలో తాగునీటి వసతి కల్పన
ముత్తకుంట – లింగి తండా శివార్లలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా అడవి జంతువులు నివసిస్తున్నందున ఫారెస్ట్ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వేసవిలోనూ తాగునీరును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వేసవిలో చెక్‌డ్యాం లో గానీ, సాసర్ పిట్స్లలో నీరు అందుబాటులో ఉండవు. అప్పుడు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తీసుకెళ్లి వాటిని నింపు తున్నారు.