నష్టాల భర్తీకి ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గం
అదనపు పెట్టుబడి లేకుండానే
ఆదాయం ఆర్జిస్తున్న సంస్థ
ప్రజల నుంచి మంచి స్పందన
రాబడుతున్న సరికొత్త ఆలోచనలు
వస్తు, సరుకు రవాణాలో తగిన జాగ్రత్తలు
నిజామాబాద్ రీజియన్‌లోని
ఆరు డిపోల్లో జోరుగా కార్గో సేవలు
ఏడాదిలో 2.36 లక్షల పార్సిళ్ల చేరవేతతో
రూ.2.22 కోట్ల ఆదాయం
బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ డిపో
పరిధిలో హోం డెలివరీ ప్రారంభం
ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. వివిధ కారణాలతో నష్టాలను మూటగట్టుకున్న సంస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా 2020 జూన్ నుంచి ప్రారంభించిన కార్గో సేవలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సరుకు రవాణా ద్వారానే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుండగా.. కార్గో సేవలను మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాలకూ సైతం విస్తరించారు. చిన్న చిన్న కొరియర్లు, పార్సిళ్లతోపాటు సుమారు 10టన్నుల వరకు సామగ్రిని తరలించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో కార్గో సేవలు కొనసాగుతుండగా.. నిజామాబాద్, బోధన్, బాన్సువాడల్లో హోండెలివరీ సైతం ప్రారంభించారు. ఏడాదికాలంలో నిజామాబాద్ రీజియన్‌లో 2.36లక్షల పార్సిళ్ల చేరవేతతో రూ.2.22కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించింది.
నష్టాల భర్తీకి ఆర్టీసీ ప్రత్యామ్నాయ మార్గం
అదనపు పెట్టుబడి లేకుండానే ఆదాయం ఆర్జిస్తోన్న సంస్థ
సరికొత్త ఆలోచనలకు మంచి స్పందన
వస్తు, సరుకు రవాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ సేవలు
nఏడాదిలో 2.36లక్షల పార్సిళ్ల చేరవేతతో రూ.2.22 కోట్ల ఆదాయం
nనిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోల్లో జోరుగా సాగుతోన్న కార్గో సేవలు…
నిజామాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వివిధ కారణాలతో నష్టాలను మూటగట్టుకుంటున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఆదాయ వనరులను అన్వేషించింది. అందులో భాగంగా 2020 జూన్ నుంచి కార్గో సేవలను ప్రారంభించింది. ఈ ప్రయత్నం చెప్పుకోదగ్గ స్థాయిలో ఫలితాలను ఇచ్చింది. గతంలో పార్సిల్, రవాణా సేవలు ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చిన ఆర్టీసీ.. ప్రస్తుతం ఆ సేవల ద్వారానే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. కార్గో సేవలను రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ర్టాలకు సైతం విస్తరించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన నూతన ఆదాయ మార్గంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. చిన్న చిన్న కొరియర్లు, ఇతర సామగ్రిని రెండు రాష్ర్టాల్లోని కోరుకున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 10 టన్నుల వరకు తరలించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం… సుఖవంతం అనే నినాదాన్ని కార్గో సేవలకు సైతం అన్వయిస్తూ సురక్షితంగా వస్తువులను చేరవేయడంలో నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని రక్షణ చర్యలు తీసుకుంటూ కార్గో సేవలను రోజురోజుకూ విస్తరిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ రీజియన్‌లో ఆరు డిపోల్లో కార్గో సేవలు నడుస్తున్నాయి. నిజామాబాద్, బోధన్, బాన్సువాడల్లో ఇంటింటికీ కార్గో సేవలను ప్రారంభించారు.
కార్గో ఆదాయం భళా…
పల్లెలకు బస్సులు నడుపుతూ, చెయ్యెత్తిన చోట వాటిని ఆపు తూ, పంచ సూత్రాలను పాటిస్తున్నప్పటికీ ఆర్టీసీకి లాభాలు మాత్రం ఆశించిన విధంగా ఉండడం లేదు. క్రమేపీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కొవిడ్ మరింత దెబ్బతీసింది. ఇక లాభం లేదని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని దిద్దుబాటు చర్యలను ప్రారంభించడంతో ఆర్టీసీ పాటిస్తోన్న నూతన విధానాలు మంచి ఫలితాలను రాబడుతున్నది. జూన్ 19, 2020లో రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ఎలాం టి పెట్టుబడి లేకుండానే వనరులను సృష్టించుకోవడంలో సఫలమై విజయవంతంగా కార్గోను అన్ని డిపోలకు విస్తరించింది. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ -1, నిజామాబాద్ -2 డిపోల్లో ఈ సేవలు జోరుగా సాగుతున్నాయి. కార్గో సేవలు ఆరంభమైన ఏడాది కాలంలో నిజామాబాద్ రీజియన్‌లో 2లక్షల 36వేల 723 పార్సిల్, ఇతరత్రా కవర్లను చేరవేసేందుకు ఆర్డర్లు పొందింది. సకాలంలో ఆయా చిరునామాలకు పార్సిల్ చేరవేతతో రూ.2కోట్ల 22లక్షల 21వేల 133 ఆదాయం దక్కించుకుంది. ప్రత్యేకంగా రూపొందించిన కార్గో బస్సులను ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలకు 1,064 ఆర్డర్లు నిర్వహించడం ద్వారా రూ.59 లక్షల 44వేల 277 మేర ఇన్కమ్ జనరేట్ అయ్యిందంటే సాధారణ విషయం కాదు.
పెరుగుతున్న ఆక్యుపెన్సీ…
కరోనా మూలంగా ఏర్పడిన లాక్డౌన్ వంటి కారణాలతో ఆర్టీసీ కుదేలైంది. ఏడాదిన్నరగా కోలుకోలేకుండా పరిస్థితులు దాపురించాయి. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడింది. ఆ సమయంలో ప్రజలు బస్సుల్లో ప్రయాణించేందుకు వెనకడుగు వేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం, అవగాహన పెరిగి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్నది. రోజూ రీజియన్‌లో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం పొందుతూ ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతూ సంస్థ సాధారణ స్థితికి చేరుకుంటున్నది. బస్సుల సంఖ్య పెరగడంతో ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ పెరిగింది. లాక్డౌన్ అనంతర కాలంలో ఆర్టీసీ బస్సుల్లో కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే ప్రయాణించే వారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎగబాకింది. అంతర్రాష్ట్ర బస్సులు రాకపోకలు సైతం మొదలవ్వడంతో ప్రజలంతా ఆర్టీసీపైనే ఆధారపడుతున్నారు.
ఇంటింటికీ కార్గో సేవలు
కార్గోకు వస్తున్న ఆదరణను గమనించిన ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ఇకపై ఇంటింటికీ సేవలను విస్తృతం చేసే దిశగా దృష్టి సారించింది. ఆర్టీసీ అంటేనే ప్రజల్లో ఒక విధమైన నమ్మకం. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఉండేందుకు వస్తు, సరుకు రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా అవి దెబ్బతినకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు. బస్సులను ప్రతి రోజూ శానిటైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల్లో ప్రజా రవాణా ఆధారంగా వస్తున్న ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. డిపోలన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అదనపు ఆదాయ వనరులు రావడంతో సిబ్బంది జీతభత్యాలు చెల్లింపు ఇతర అవసరాలు తీరుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 2021, జూలై 26 నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్, బోధన్, బాన్సువాడ బస్ స్టేషన్లలో డోర్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించారు. రోడ్డు రవాణా సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర నగరాలకు పార్సిళ్లు, సామగ్రిని సరఫరా చేసి వ్యాపారం పెంపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.