మోర్తాడ్, సెప్టెంబర్ 21: కంకరరోడ్డు..సింగిల్ తారురోడ్డుగా…ఇప్పుడు డబుల్ తారురోడ్డుగా మారింది సుంకెట్ బైపాస్ రోడ్డు. కంకర రోడ్డుగా ఉన్నప్పుడు ఈరోడ్డుపై ప్రయాణం నరకంగా ఉండేది. దానిని తారురోడ్డుగా మార్చేందుకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి గతంలో నిధులు మంజూరు చేయడంతో ఆ పనులు పూర్తయ్యాయి. ఆ రోడ్డు కూడా ధ్వంసం కావడంతో డబుల్‌రోడ్డుగా మార్చేందుకు రూ.1.18కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఈ రోడ్డు పూర్తయి ప్రయాణికుల ఇబ్బందులు దూరమయ్యాయి.
డబుల్ రోడ్డుతో ఇబ్బందులు దూరం
మోర్తాడ్ నుంచి సుంకెట్, భీమ్‌గల్ వెళ్లాలంటే మోర్తాడ్ గ్రామం మీదుగా వెళ్లేవారు. బైపాస్‌రోడ్డు ఏర్పడ్డాక గ్రామం బయటి సురేశ్కాలనీ నుంచి వెళ్లే అవకాశం ఏర్పడింది. అయితే రోడ్డు బాగా లేని కారణంగా ప్రయాణికులు నానా ఇబ్బందులు పడేవారు. వానకాలంలో నరకం చూసే వారు. ఇదే రోడ్డు పక్కన గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ క్లస్టర్ దవాఖానలు ఉండడంతో ఈ రోడ్డుకు ప్రాధాన్యత ఏర్పడింది. రోడ్డు వేయించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.1.18కోట్లు మంజూరు చేయించారు. దాంతో డబుల్తారురోడ్డుగా మారింది. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. ఈ రోడ్డు ద్వారా ప్రయాణించడంతో మోర్తాడ్ గ్రామం నుంచి కాకుండా సుంకెట్ వైపు మోర్తాడ్ శివారులోకి వస్తుంది. ప్రయాణికులకు ఇది దగ్గరగా కావడం, ప్రమాదాలు జరగకుండా వెళ్లేలా ఉండడంతో అందరికీ ఉపయోగకరంగా మారింది.
ఇబ్బందులు దూరమయ్యాయి
గతంలో రోడ్డు బాగాలేక గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డబుల్‌రోడ్డు కావడంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లగలుగుతున్నాం. ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి కూడా సౌకర్యంగా ఏర్పడింది. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.