భూపంపిణీ చేసినా.. స్థలాన్ని చూపించని కాంగ్రెస్ ప్రభుత్వం
2006 నుంచి ఘర్షణ పడుతున్న లబ్ధిదారులు
పట్టించుకోని అధికారులు
తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రాజంపేట గ్రామస్తులు
రాజంపేట, ఆగస్టు 20: రాజంపేట గతంలో భిక్కనూరు మండలంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. 2006వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామ శివారులోని 576 సర్వేనంబర్‌లో పలువురికి భూమిని పంపిణీ చేశారు. కానీ ఎవరికీ భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే హద్దులను చూపలేదు. అప్పట్లో అధికారులు చేసిన తప్పునకు ఇప్పటివరకు పలువురు బాధితులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. భూమిని చూపకపోవడంతో దీనిని ఆసరాగా చేసుకొని పలువురు భూ కబ్జాకు పాల్పడుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
రాజంపేట మండలంగా ఆరేండ్ల క్రిత ఏర్పడింది. దీంతో భూముల ధరలకు ఒకేసారి రెక్కలు వచ్చాయి. దీనిని స్థానిక నాయకులు తమకు అనుకూలంగా మార్చుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు. రాజంపేటలోని బోరుగడ్డ ప్రాంతంలో 576 సర్వేనంబరు భూమి రోడ్డుకు ఆనుకొని ఉండడం, అందులో ప్రభుత్వ భూమి కూడా ఉండడంతో కబ్జాకు గురవుతున్నదని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వే నంబరు 576లో 501 ఎకరాల భూమి..
రాజంపేటలోని 576 సర్వే నంబర్లో 501 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 290 ఎకరాలను అప్పట్లో 200 మంది పేదలకు కేటాయించారు. వారికి హద్దులను మాత్రం చూపలేదు. అనంతరం ఇదే సర్వే నంబరులో సుమారు 35 ఎకరాలను ప్రభుత్వ కార్యాలయాలకు మినహాయించారు. మిగిలిన భూమిలో కొంత మంది రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ వారికి కూడా ఇబ్బందులకు గురిచేసి కబ్జాలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
ఇదే సర్వేనంబరు నుంచి కాళేశ్వరం కాలువ వెళ్తున్నది. దీంతో కొంతమంది బడానాయకులు కాలువలో తమ భూమి ఉందని చూపించి ప్రభుత్వం నుంచి పరిహారం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. అదే పాసు పుస్తకాన్ని చూపించి ఇష్టానుసారంగా భూమిని కబ్జా చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మండల కేంద్రంలో రైతువేదిక, కస్తూర్బా పాఠశాల, ఎంపీడీవో కార్యాలయాలు నిర్మించారు. వీటి ఎదురుగా ఉన్న సుమారు 25 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని పలువురు బాధితులు తెలిపారు. వాటిలో ప్రస్తుతం పంటలను పండిస్తున్నారు. దీనిపై గతంలో ‘నమస్తే తెలంగాణ’లో వార్త ప్రచురితం కావడంతో కేవలం రెండు ఎకరాల భూమికి మాత్రమే అధికారులు బోర్డును ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారని బాధితులు తెలిపారు. ఇంత జరుగుతున్నా స్థానిక అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
576 సర్వే నంబరులో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూమిని కేటాయించింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు స్థలం చూపలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం తగు చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు భూమిని ఎవరూ దున్నడానికి వీలులేదు. ఎవరైనా కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.