సొంత అవసరానికే భూమిని అమ్మాడు
పల్లెప్రగతి నిధుల బకాయిల్లేవు: డీపీవో జయసుధ
ఆరెపల్లి సర్పంచ్ ఉదంతంపై విచారణ
డిచ్పల్లి, ఆగస్టు 20: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి బిల్లులు రాక అరెకరం పొలం అమ్ముకోవడంతోపాటు కుటుంబపోషణ కోసం రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు డిచ్పల్లి మండలం ఆరెపల్లి సర్పంచ్ ఇరాసు మల్లేశ్ పేరిట దినపత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవమని డీపీవో జయసుధ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆరెపల్లి గ్రామ పంచాయతీకి సాధారణ నిధులు రూ.60వేలు మంజూరు కాగా రూ.60వేలు ఖర్చు చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.3,84,972 మంజూరు కాగా రూ.2,82,558 ఖర్చు రూ.1,02,414 మిగులు ఉందన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.3,48,659 మంజూరు కాగా రూ.3,35,176 ఖర్చు చేయగా.. రూ.13,483 మిగులు ఉందన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆరెపల్లి గ్రామ పంచాయతీకి సాధారణ నిధులు రూ.లక్షా 50 వేలు మంజూరు కాగా రూ.71వేలు ఖర్చు చేయగా.. రూ.79వేలు మిగులు ఉందని డీపీవో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.2,42,689 మంజూరు కాగా అందులో రూ.2,10,917 ఖర్చుపెట్టారు. మిగతా రూ.31,772 ఉన్నాయన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.51,231 మంజూరు కాగా రూ.49,861 ఖర్చు కాగా రూ.1370 మిగులు ఉందని వివరించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని విచారించగా ప్రతి నెలా గ్రామ పంచాయతీకి రూ.37వేలు జమవుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ట్యాంకుకు పెయింటింగ్ చేయించేందుకు సర్పంచ్ రూ.20వేలు ఖర్చు చేయగా, ఎంబీ రికార్డు కాకపోవడంతో బిల్లు చెల్లించలేదన్నారు. దోమల నివారణ కోసం స్ప్రే చేసేందుకు రూ.8వేలు ఖర్చు చేశారు. అంతేకానీ గ్రామ పంచాయతీకి సంబంధించి అదనపు ఖర్చులు చేయలేదన్నారు. కేవలం తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా దవాఖానల బిల్లుల చెల్లింపు కోసం సర్పంచ్ తన పొలాన్ని అమ్ముకున్నారని, బిల్లుల చెల్లింపుల విషయంలో కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే సర్పంచులకు గౌరవవేతనం చెల్లిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద చేపట్టిన కంపోస్టు షెడ్, శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మాణ పనులకు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు వివరించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీకి రూ. 37,748 గ్రాంటు మంజూరుకాగా సిబ్బంది జీతభత్యాలకు రూ.14,500, ట్రాక్టర్ ఈఎంఐ రూ.10,800, మొత్తం రూ.32,241 చెల్లింపులు జరుపుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెల్లడించినట్లు డీపీవో ప్రకటనలో స్పష్టం చేశారు.