స్వరాష్ట్రంలో మూడోసారి వేతన పెంపు
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం పెరిగిన వేతనం
జూలై ఒకటి నుంచే పెంపు నిర్ణయాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం
ఏడేండ్లలో మూడు సార్లు పెంచిన సీఎం కేసీఆర్
అంగన్వాడీలకు రూ.10,500 నుంచి రూ.13,650 వరకు..
ఆయాలకు రూ.6వేల నుంచి రూ.7,800లకు పెంపు
ఉమ్మడి జిల్లాలో ఐదువేల మందికి లబ్ధి
శిశు సంక్షేమంతోపాటు మహిళల ఆరోగ్యరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు రాష్ట్రప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మరోసారి వేతనాలు పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు ఐదువేల మందికి లబ్ధి చేకూరగా.. వారి కుటుంబాలు ఆనందంలో మునిగితేలుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర సర్కారు రెండు రోజులక్రితం ఉత్తర్వులు జారీచేసింది. అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.13,650.. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.7,800, ఆయాల వేతనం రూ.7,800కు పెరిగింది. పెంచిన వేతనాలను జూలై ఒకటి నుంచి వర్తింపజేయనున్నారు. స్వరాష్ట్రంలో ఏడేండ్లలో అంగన్వాడీలకే రాష్ట్రప్రభుత్వం మూడుసార్లు వేతనాలు పెంచడం విశేషం. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాతా శిశు సంరక్షణలో భాగంగా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, ఆరేండ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఇవి దోహదపడుతున్నాయి. శిశు సంక్షేమంతోపాటు మహిళల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ కంటికి రెప్పలా చూడడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేసే కృషి అంతా ఇంతా కాదు. పూర్వ ప్రాథమిక విద్యను పిల్లలకు అందిస్తూ వారికి ఆరోగ్య వంతమైన ఆహారాన్ని ఇవ్వడంలోనూ వీరే కీలకం. పేద కుటుంబాల్లో పొట్ట గడవడమే గగనమైన పరిస్థితిలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తోంది. సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరి పనికి తగిన వేతనం అందక నిత్యం రోడ్డెక్కి ధర్నాలు చేసేవారు. బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న అంగన్వాడీ నిర్వాహకుల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఏడేండ్ల స్వరాష్ట్ర పరిపాలనలో మూడు సార్లు వేతనాలు పెంపుదలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రతను కల్పించడం విశేషం.
ఉమ్మడి జిల్లాలో ఐదువేల మందికి ప్రయోజనం
వేతనాల పెంపు నిర్ణయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు ఐదువేల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు వారి కుటుంబాల్లో సంబురం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా 30శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన వేతనాలు జూలై ఒకటి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లకు వేతనం రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.7,800, హెల్పర్ల వేతనం రూ.7,800కు పెరిగింది. వేతనాల పెంపుపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సంబురాలు చేసుకుం టున్నారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచినందుకు సీఎం కేసీఆర్కు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజ్ఞతలు చెబుతున్నారు. గతంలో వేతనాల పెంపుకోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తీవ్రమైన ఆందోళనలు చేయాల్సి వచ్చేది. వీరి జీతాల పెంపు అంశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ్యం కోసం వాడుకునేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వీరి సాధకబాధకాలను పరిష్కరించడంతో సందట్లో సడేమియాలకు అవకాశం లేకుండా పోయింది.
ఏడేండ్లలో మూడోసారి…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో ఇప్పటి వరకు పలు దఫాలుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలు పెరిగాయి. గతంలో చాలీచాలని జీతాలతో వీరంతా సతమతమయ్యారు. సీఎం కేసీఆర్ కొత్త రాష్ర్టానికి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది నెలలకు అంగన్వాడీ టీచర్లకు రూ.4,200 నుంచి రూ.7వేలకు పెంచారు. మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.2,200 నుంచి రూ.4,500లకు వేతనాలు పెరిగాయి. 2017 ఫిబ్రవరి 27న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రగతి భవన్కు పిలిపించి, కలిసి భోజనం చేసి రెండోసారి వేతనాలు పెంచారు. అంగన్వాడీ టీచర్లకు రూ.7వేల నుంచి రూ.10,500కు, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6వేలు చేశారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఇటీవల 30శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, హోంగార్డు తదితర అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ వర్తింపజేస్తామని సర్కారు పేర్కొంది. ఇందులో భాగంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు మూడు రెట్ల కన్నా అధికంగా 325శాతం, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు 354శాతం వేతనాలు పెరగడం విశేషం.