దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనున్నది. హుజూరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం.. వాసాలమర్రి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని ఒక్కో మండలాన్ని ఇప్పటికే సీఎం ఎంపిక చేశారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ఆయా మండలాలపై సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన మంత్రులతోపాటు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి కలెక్టర్, ఇతర శాఖల జిల్లా అధికారులు హాజరుకానున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నిజాంసాగర్ మండలం ఎంపికవగా, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన జనాభా వివరాలను గ్రామాలు, ఉపకులాల వారీగా వర్గీకరించారు. జుక్కల్ నియోజకవర్గంతోపాటు నిజాంసాగర్ మండల భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధికారులు నివేదికను సిద్ధం చేశారు.
నిజామాబాద్, సెప్టెంబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళిత బంధు పథకం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నది. హుజూరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన పథకం వాసాలమర్రి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండలాల్లో అమలుకు సర్కారు నిర్ణయించింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోని ఒక్కో మండలాన్ని ఇప్పటికే సీఎం ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే నాలుగు మండలాల్లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న ఆయా మండలాలపై సీఎం కేసీఆర్ సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి కలెక్టర్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొంటున్నారు. సీఎం సమావేశం నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించిన నిజాంసాగర్ మండలంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జనాభా వివరాలను గ్రామాల వారీగా, ఉప కులాల వారీగా వర్గీకరించారు. దీంతో పాటు జుక్కల్ నియోజకవర్గం, నిజాంసాగర్ మండలం భౌగోళిక, సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధికారులు నివేదికను సిద్ధం చేశారు.
జోరుగా చర్చ..
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఫథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై విస్తృతంగా చర్చించారు. అర్హులైన వారికి దళిత బంధు ఫలాలను సీఎం అందించారు. పథకం పూర్వాపరాలను సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రజలందరికీ విశదీకరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఫలితాలు ప్రజల అనుభవంలా ఉన్నాయి. దళిత జాతిలోని పేదరికాన్ని రూపుమాపాలని ప్రవేశ పెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం దేశానికే దిక్చూచిలా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న దళితబంధు మిగిలిన పథకాలకు పూర్తిగా భిన్నమైనది. పేదల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. దళిత కుటుంబాల్లో పేదరికాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు ఉద్దేశించిన దళితబంధు త్వరలోనే ఉమ్మడి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోనూ ఆరం భం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే పథకాన్ని అమలు చేసేందుకు బలంగా ముందుకు వెళ్తున్నారని వారంతా అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
లెక్కలివీ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా ఉన్నది. మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గంలో జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,59,918 మంది జనాభా ఉంది. వీరిలో పురుషులు 1,30,008, స్త్రీలు 1,29,910 మంది ఉన్నారు. దళిత బంధుకు ఎంపికైన నిజాంసాగర్ మండలంలో దాదాపుగా 1200 దళిత కుటుంబాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. నియోజకవర్గం మొత్తంలో సుమారు ఎనిమిది వేల కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గంలో 40వేల మంది దళితులు ఉన్నారు. నిజాంసాగర్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 26 ఎస్సీ ఉపకులాలకు చెందిన 1,646 దళిత కుటుంబాలున్నాయి. మొత్తం 5,600 మంది జనాభా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా జనాభా 9,72,625 మంది. ఇందులో పురుషులు 4,78,389 మంది, స్త్రీలు 4,94,236 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఎస్సీ జనాభా దాదాపుగా 1. 53.302 మంది వరకు ఉన్నారు. జిల్లా జనాభాలో వీరి శాతం 15.76 ఉంది. ఎస్సీల్లో పురుషులు 74,133 మంది, స్త్రీలు 79,169 మంది ఉన్నారు.
దళిత వర్గాల్లో సంబురం..
రాష్ట్రవ్యాప్తంగా దళితబంధుకు సంబంధించి మరో నాలుగు మండలాల్లో అమలు చేసేందుకు గత నెలలో ప్రభుత్వం నిర్ణయించింది. మధిర నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నుంచి తిరుమలగిరి, అచ్చంపేట నుంచి చారకొండ, కామారెడ్డి నుంచి జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని ఎంపిక చేశారు. నాలుగు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాలుగు మండలాలు ఎంపికయ్యాయి. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఉంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు సరిహద్దును పంచుకునే నిజాంసాగర్ మండలం ఎంపిక కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దళిత ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే జుక్కల్ నియోజకవర్గంలోని మండలానికి దళిత బంధు పథకం అమలుకు నోచుకోనుండడంతో ఆయా వర్గాల్లో సంబురం వ్యక్తమవుతున్నది. నిజాంసాగర్ మండలం భౌగోళికంగా వెనుకబాటుకు గురైన నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గానికి, ఇటు ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాలకు సరిహద్దు కలిగి ఉంది. వెనుకబాటుకు గురైన నిజాంసాగర్ మండలంలో దళితబంధు అమలు చేయడం ద్వారా చుట్టూ ఉన్న మూడు నియోజకవర్గాల్లోని ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు సులువుగా ప్రభుత్వానికి తెలియనున్నాయి. దళితబంధు పథకం గొప్పతనంపై అవగాహన రానున్నది.