అక్రమార్కుల ఆధీనంలో ఉన్న దేవుడి మాన్యాలు తిరిగి దేవుడికే దక్కాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దేవాలయాలకు చెందిన భూములు ఇతర జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రం లోనూఉన్నాయి. దశాబ్దాలుగా భూములు అన్యాక్రాంతమవగా.. రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన కొందరు అధికారులు ఆక్రమణదారులకు వంతపాడారు. ఫలితంగా విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన దేవాదాయ శాఖ కొంతకాలంగా ఆలయ మాన్యాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కబ్జాకు గురైన దేవాదాయ భూములు తిరిగి ప్రభుత్వ వశమయ్యాయి. ఉభయ జిల్లాల్లో మొత్తం 223.21 ఎకరాల ఆలయ భూములు కబ్జా చెర వీడాయి. ఇందులో అత్యధికంగా నీలా రామాలయానికి చెందిన 74 ఎకరాల భూములు ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2,622 ఎకరాల భూములను దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోగా.. ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉంది.
నిజామాబాద్, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో దేవాలయాలు ఉన్నాయి. నిత్య పూజలతో ప్రజల ఆరాధనలతో కళకళలాడే ఆలయాలకు దశాబ్దాల క్రితం నుంచి వందల ఎకరాల మాన్యం ఉంది. కాలం గడిచిన కొద్దీ ఆయా ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలు మరుగున పడిపోయాయి. ఇదే అదనుగా కొంతమంది రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు కలిసి కబ్జాదారులకు వంత పాడారు. ఫలితంగా విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇలా ఒక్కో ఆలయ పరిధిలో గుంటల దగ్గరి నుంచి వందల ఎకరాల వరకు కబ్జాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాలకు ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లోనూ భూములుండడం విశేషం. వీటిపై దేవాదాయ శాఖ సీరియస్‌గా దృష్టి సారించింది. కొంత కాలంగా దేవాలయాల పరిధిలోని ఆస్తుల వివరాలను సేకరించగా కబ్జాకు గురైన భూముల వివరాలు తేటతెల్లమయ్యాయి. ఇందులో కబ్జా చెర నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి దాదాపుగా 223.21 ఎకరాల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో మహారాష్ట్రలోని ధర్మాబాద్లోనూ అత్యధికంగా 74 ఎకరాల భూములుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో 3వ స్థానం
రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా దేవాదాయ శాఖ పరిధిలో ఆలయ భూములను సర్వే నిర్వహించింది. ప్రస్తుతం ఆలయాల పరిధిలో ఉన్న భూములెన్ని? కబ్జాకు గురైన వివరాలేంటి? ప్రస్తుతం ఆధీనంలో ఉన్నవి ఏవేవి? అన్న కోణంలో పరిశీలన చేపట్టింది. ఇందులో వందలాది దేవాలయాల పరిధిలో విలువైన సాగు భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రముఖ దేవాలయాలతో పాటు పంచాయతీల్లోని పురాతన ఆలయాలకు సంబంధించిన భూములను గుర్తించారు. నిజామాబాద్ నీల కంఠేశ్వరాలయం భూములు రూ.కోట్లు విలువ చేస్తున్నాయి. జెండా బాలాజీ గుడి భూముల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. వీటి భూములను దేవాదాయ శాఖ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 223.21 ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వం సాధించిన ఘన విజయమిది. రాష్ట్ర వ్యాప్తంగా 2622 ఎకరాల భూములను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోగా.. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలవడం విశేషం.
ఉమ్మడి జిల్లాలో 1358 ఆలయాలు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 1358 దేవాలయాలున్నాయి. వీటి పరిధిలో దాదాపుగా నాలుగు వేల ఎకరాల మేర దేవాదాయ భూములున్నట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 1600 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. మిగిలినవి గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉండడంతో వాటిని ఆయా ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారు. కబ్జా కాకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల దేవాదాయ భూములను సాగులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ఆలయాల పరిధిల్లోని భూములను ఏటా వేలం వేసి తద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి ఆలయాలకే అందిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 361 దేవాలయాల పరిధిలో 1627 ఎకరాలకు కౌలు వేలం నిర్వహిస్తున్నారు. 2020లో 744 ఎకరాలకు వేలం నిర్వహించగా సుమారుగా రూ.40లక్షల ఆదాయం వచ్చింది. 2021లో వేలం ప్రక్రియలో దేవాదాయ శాఖ అధికారులు జాప్యం ప్రదర్శించారు. దీంతో ఆలయాలకు రావాల్సిన ఆదాయం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం వానకాలం ప్రారంభ సమయానికి ముందే వేలం ప్రక్రియను పూర్తి చేస్తుంటారు. వర్షాలు దంచి కొట్టడం మూలంగా కౌలుకు డిమాండ్ పెరిగింది. దేవాదాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈసారి వేలం ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
ధర్మాబాద్‌లో 74 ఎకరాలు
దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న భూ ముల్లో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. కొన్ని భూములను అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. మరికొన్ని భూములకు సంబంధించిన రికార్డులను మాయం చేసే కుట్రకు పాల్పడ్డారు. పాత రికార్డులను తిరిగి తోడగా కబ్జాదారుల కహానీలు అన్ని బట్టబయలయ్యాయి. 223.21 ఎకరాల్లో అత్యధికంగా రెంజల్ మండలంలోని నీలా ఆలయ భూములే ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన అన్యాక్రాంతమైన 74 ఎకరాల భూములను మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా ధర్మాబాద్‌లో గుర్తించారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం భూములు మూడు ఎకరాల విలువైన స్థలాన్ని బతుకమ్మకుంటలో గుర్తించారు. నవీపేట మండలంలోని యంచలోని సీతారామ టెంపుల్‌కు సంబంధించి 18 ఎకరాలు స్వాధీనమయ్యాయి. నవీపేటలో బినోలలో అనుబంధ ఆలయాలకు సంబంధించిన 35 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద పురాతన ఆలయానికి చెందిన మూడెకరాలు, మద్నూర్లోని లక్ష్మీనారాయణ ఆలయానికి చెందిన 16 ఎకరాలున్నాయి. ఇలా అనేక ఆలయాలకు సంబంధించిన దేవుడు భూములు తిరిగి దేవుడికే దక్కడంతో భక్తులంతా సంతోషిస్తున్నారు.
ఆ భూములను కౌలుకు ఇస్తాము
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఆయా దేవాలయాలకు సంబంధించిన భూములను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాము. ఆక్రమిత భూములకు సంబంధించిన హక్కులన్నీ తిరిగి సంబంధిత ఆలయాల పరిధిలోకి తీసుకువచ్చాము. స్పెషల్ డ్రైవ్ సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాము. ఈ భూములకు వేలం నిర్వహించి కౌలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తాము. తద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సంబంధిత ఆలయాలకు అందిస్తాము.