
రోహిణి కార్తెలో ఎండలకు అన్నిచోట్లా పొలాలు నెర్రెలుబారుతాయి. కానీ, మంజీర తీరంలో మాత్రం రైతులు సేద్యానికి నారుపోసుకుంటారు. అందుకే అన్నిప్రాంతాలకన్నా ముందు ఇక్కడ నాట్లు పూర్తవుతాయి. పంటకోతలు కూడా తొలుత ఇక్కడే ముగుస్తాయి. ఉమ్మడి జిల్లాలోని మంజీర పరీవాహక ప్రాంతం విభిన్నమైన సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నది. 120 రోజుల వరి పంటకాలాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవడంలో ఇక్కడి రైతులు సఫలమవుతున్నారు. నీటివనరులు పుష్కలంగా ఉండడంతో రైతులు వివిధ రకాల పంటల సేద్యంలో ఎప్పుడూ ముందుంటున్నారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గ రైతులు పంటలమార్పిడి విధానంలో నిత్య ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అటు నిజాంసాగర్ నుంచి ఇటు బోధన్ వరకు రైతులు సీజన్‌కు అనుగుణంగా ఏటా సాగు పనులు ప్రారంభిస్తుంటారు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నిజాంసాగర్ ఆయకట్టు కింద ముందస్తు పంట కోతల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇక్కడి సేద్యవిధానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.
నిజామాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని మంజీ ర పరీవాహక ప్రాంతం ఓ విభిన్నమైన సేద్యంతో ముందుంటుంది. ఆది నుంచి ఈ ప్రాంతంలో నీటి జాడకు కొదువ లేకపోవడంతో ఆదర్శవంతమైన సాగు విధానాల్లో ఈ ప్రాంత రైతులు ఎప్పుడూ ముందుంటారు. ఎగువ చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు ఉండడంతో ఆయకట్టు రైతులు ఏటా పం టల సీజన్‌కు అనుకూలంగా సాగు మొదలుపెడుతుంటారు.ఈ రకమైన పద్ధతిని కచ్చితంగా అమ లు చేసే రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కనిపించరు. కేవలం బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోని రైతులే పక్కాగా సీజన్‌కు అనుకూలంగా పంటలు పండిస్తుంటారు. అక్టోబర్ మొదలవ్వడంతోనే వానకాలం సీజన్ ముగిసి చలి కాలం మొదలైనట్లే. చాలా ప్రాంతాల్లో వరి పంట మధ్యస్థ స్థాయిలో ఎదిగి ఉంది. కానిక్కడ ఏకంగా వరి కోత లు మొదలవ్వడం ఏటా కనిపించే రివాజు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావించడంతో మంజీర పరీవాహక రైతుల సేద్యపు విధానాలపై ఆసక్తి ఏర్పడింది. నిజాంసాగర్, బీర్కూర్, కోటగిరి, బోధన్ మండలాల్లో ఇప్పుడు కోతలు మొదలై ప్రైవేటు కొనుగోళ్లు సైతం జోరందుకుంటున్నాయి.
సాగు వ్యూహం..
మంజీరా నది పరీవాహక ప్రాంతాల్లో రైతులు అవలంబించే సాగు వ్యూహంతో వీరికి అనేక అనుకూలతలున్నట్లుగా వ్యవసాయాధికారులు చెబుతున్నా రు. బోరు బావుల కింద సాగయ్యే ఈ పొలాల్లో యాసంగి సీజన్‌కు నవంబర్‌లో నాట్లు వేసేస్తారు. వానకాలం సీజన్‌కు రోహిణికార్తెకు వరి నాట్లు మొ దలై జూన్ నాటికి పూర్తవుతాయి. యాసంగిలో ఫి బ్రవరి నెలాఖరు లేదంటే మార్చి నెల ప్రారంభం తోనే కోతలు మొదలవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నది.వానకాలం సీజన్‌కు అక్టోబర్ నెల ప్రా రంభంతోనే కోతల సందడి షురూ అవుతుంది. 120 రోజుల వరి పంట కాలాన్ని ప్రణాళికబద్ధంగా వినియోగించుకోవడంలో ఇక్కడి రైతులు సఫలం అవుతున్నారు. కోతలు పూర్తవుతుండగానే వ్యవసాయ భూముల్లో ఒక మడిని(కొంత ప్రాంతాన్ని) నారుమడికి సిద్ధం చేసుకోవడం వీరి ప్రత్యేకత. వి రామం అన్నది తీసుకోకుండా పంటను అమ్ముకోగానే వెంటనే నారుమడులకు రెడీ అవుతారు. 30 రోజుల్లో నారు చేతికి రాగానే వెంటనే నాట్లు వే స్తా రు. కాలానికి అనుగుణంగా పంటలు పండించే ఈ రైతుల్లో మరో గొప్ప విషయం కూడా ఉంది. చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు పొలం వద్దనే కనీస మద్దతు ధరకు సరిసమానంగా విక్రయించుకుని లాభాలు పొందుతున్నారు. రవా ణా చార్జీల ఇబ్బంది, వెయింటింగ్, మిల్లర్ల మోసాలనేవి లేవు.
ఆదర్శ సేద్యం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యవసాయిక జిల్లాగా పేరొందింది. గోదావరి, మంజీరా నదుల పరీవాహకంతో నిత్యం కళకళలాడుతుంది. ఓ వైపు నిజాంసాగర్, మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో ఉభయ జిల్లాలకు ప్రత్యేకతలున్నాయి. దశాబ్దాల నుంచి సాగులో మేటిగా నిలుస్తున్న ఈ ప్రాంతం లో భిన్న పంటల సమాహారం కనిపిస్తుంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన ప్రత్యేకతలున్నాయి. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బా ల్కొండ బెల్టులో రైతులు ఎవరికి వారే సాటి అన్నట్లుగా సాగు చేస్తుంటారు. నిత్య ప్రయోగాలతో పంటల మార్పిడి విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పసుపు, మక్కజొన్న, ఎర్రజొన్న, జొన్న, వరి, సోయాబీన్, కూరగాయల సాగుతో అధిక లాభాలు సాధిస్తుంటారు. వీరంతా విరామం లేకుండా వ్యవసాయ క్షేత్రంలో పని చేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్, బీర్కూర్, కోటగిరి, బోధన్ మండలాల్లోని రైతులు మరింత భిన్నం. ఠంచనుగా పంటల సీజన్‌ను పాటించడంలో వీరం తా గుర్తింపు పొందారు. రాష్ట్రంలో కోతలు మొదలయ్యే నాటికి ఈ ప్రాంతాల్లో నాట్లు పూర్తవుతా యి. మిగిలిన ప్రాంతాల్లో కోతలు పూర్తయ్యే సమయానికి ఈ ప్రాంతంలోని వరి పంట ఏపుగా ఎదిగి పొట్ట దశకు చేరుకుంటుంది. మంజీర పరీవాహక ప్రాంతాల్లో నాట్లు వేసే సమయానికి మిగిలిన ప్రాం తాల్లో కనీసం కోతలు కూడా మొదలవ్వని పరిస్థితులు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు.
విపత్తులకు దూరంగా…
వర్షాకాలం పూర్తయిన పిమ్మట అక్టోబర్‌లో చెడగొ ట్టు వానలు రైతులను నిండా ముంచడం చూ స్తుంటాం. వరి పొట్ట దశకు చేరుకున్న సమయంలో ఎడాపెడా కురిసే వానలతో చాలా మంది రైతులు తీవ్రంగా దెబ్బతినే దుస్థితి ఏర్పడుతుంది. మంజీర పరీవాహకంలో 30 వేల ఎకరాల్లో సాగు వ్యూహం అవలంబించే రైతులకు ఇలాంటి ముప్పు దరి చేర దు. చెడగొట్టు వానలు వచ్చే సమయానికి పొలాల్లో ఒక్క గింజ ఉండనివ్వరు. పైగా నాట్లకు సిద్ధమయ్యే పనిలో నిమగ్నమై ఉంటారు. కోతలైన భూముల్లో కురిసే చెడగొట్టు వానతో బోరు బావుల అవసరం లేకుండా భూమిని తడుపుతుందని వీరి భావన. యాసంగిలోనూ చలి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పంట సాగవ్వడంతో ఎండాకాలం ముం చుకొచ్చే నాటికి కోతలు పూర్తి చేసుకుని ఉండడం తో విపత్తులు అనేవి వీరి దరి చేరవు. నష్టాలు ఎదుర్కోవడం చాలా తక్కువే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సాగునీటి ఇక్కట్లు తీరాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక దృష్టితో వీరికి కొండంత అండ లభించడంతో సమయానికి నీరందడం మూలంగా ఏటా రెండేసి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఏడేండ్ల క్రితం ఆయకట్టు ప్రశ్నార్థకంలో ఉండగా ఇప్పుడు కళకళలాడుతోంది.
సాగులో మాకు పోటీ ఎవరూ ఉండరు
నేను 15 ఎకరాల్లో వరి సాగు చేశాను. జూన్ 2 తారీఖు నాడు నాట్లు వేశాను. రెండు రోజులుగా వరి కోస్తున్నాం. నేను సాగు చేసే సమయంలో బయటి రైతుల నుంచి పో టీ ఉండదు. ఎరువు, విత్తనాలు ఏది కావాలన్నా మార్కె ట్లో కొరత ఉండదు. కోత మిషిన్ అనుకున్న సమయానికి తక్కువధరకే వస్తుంది. నిర్వహణ ఖర్చులు తక్కువైతా యి. అందరికన్నా ముందే పంటఅమ్ముకుని యాసంగికి సిద్ధం చేస్తున్నా.
రోహిణి కార్తెలోనే నారుమడులు పోస్తాం
వర్షాకాలం పంటకు ఇంకా నెల రోజుల సమయం ఉందనగానే మేము సాగుకు ఏర్పాట్లు చేసుకుంటాం. యాసంగి పంట అమ్ముకుని వెంటనే వానకాలం సాగుకు రోహిణి కార్తెలోనే మోటరు బోర్ల వద్ద నారుమడులు పోసుకుంటాం. ఇది మాకు చాలా ఏండ్ల నుంచి అలవాటైన పద్ధతి. ఇది మాకు మంచిగానే ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తున్నది.