
బోధన్, అక్టోబర్ 9: బోధన్ రైల్వేమార్గంపై నిర్లక్ష్యం వీడనాడాలని, గతంలో బోధన్‌కు నడిచే రైళ్లను పునరుద్ధరించడంతోపాటు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌కు పొడిగించాలన్న తదితర డిమాండ్లతో ఆదివారం పెద్ద ఎత్తున ట్విట్టర్ వేదికగా ఉద్యమం నిర్వహించాలని బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ట్విట్టర్ ద్వారా తమ డిమాండ్లను రైల్వేశాఖ మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవించాలని తలపెట్టారు. బోధన్ పట్టణంలోని విద్యార్థి, యువకులు పెద్ద సంఖ్యలో సరిగ్గా ఆ సమయానికి బోధన్ రైల్వేమార్గానికి సంబంధించిన తమ డిమాండ్లను పరిష్కరించాలని ట్వీట్ చేయాలని బోధన్ విద్యార్థి సంఘాల జేఏసీ ఒక ప్రకటనలో కోరింది. ఈ మేరకు పట్టణంలోని విద్యార్థులు, యువకులతో పాటు పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఇందుకు సమాయాత్తం చేస్తున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా, డీఆర్ఎం ఎం.శ్రీనివాస్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు బోధన్ రైల్వే సమస్యలపై ట్వీట్ చేయాలని కోరారు. బోధన్-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్ వరకు పొడిగించాలని, బోధన్-మిర్జాపల్లి ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని, బోధన్-బీదర్ రైల్వేలైన్ పనులను వెంటనే ప్రారంభించాలని, నిజామాబాద్-కరీంనగర్ డెమో రైలును బోధన్ నుంచి ప్రారంభించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్చేస్తున్నామని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఇటీవల శక్కర్‌నగర్, ఎడపల్లి రైల్వేస్టేషన్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, బోధన్‌లోని గాంధీపార్కు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మరమ్మతు పనులు చేపట్టాలన్నది తమ డిమాండ్లు అని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు వివరించారు.