అంతర్రాష్ట్ర వంతెన మీది నుంచి ఎగిరి దుంకిన భారీ ప్రవాహం
కందకుర్తి వద్ద ఉగ్రరూపిణిగా గోదావరి
మంజీర జలాల సంగమంతో రికార్డుస్థాయిలో వరద
నదీ పరీవాహక ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన జలాలు
ఇంతటి వరద ఉధృతి ఏడేండ్లలో ఇదే మొదటిసారి..
ఈ సీజన్లో ఎస్సారెస్పీకి205 టీఎంసీల ఇన్‌ఫ్లో, 142 టీఎంసీల అవుట్ ఫ్లో..
ఏడేండ్ల విరామం తర్వాత గోదావరి మరోమారు మహోగ్రరూపాన్ని దాల్చింది. ఇటు మనరాష్ట్రంలోనూ ఎగువన మహారాష్ట్రలోనూ కురుస్తున్న వర్షాలకు మంగళవారం నుంచి గోదావరి ప్రవాహ ఉధృతి క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీనికితోడు నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో వరదనీటితో వడివడిగా మంజీర వచ్చి చేరింది. ఫలితంగా రెంజల్ మండలం కందకుర్తి చుట్టూ కనుచూపు మేర నీటిప్రవాహమే కనిపిస్తున్నది. మహారాష్ట్ర-తెలంగాణ మధ్యనున్న అంతర్రాష్ట్ర వారధి మీదినుంచి వరద పొంగిపొర్లుతుండడంతో.. రాకపోకలను నిషేధించారు. 2014 తర్వాత త్రివేణి సంగమంలో గోదావరికి ఇంతటి వరద ఉధృతి ఎప్పుడూ లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి నేటివరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 205.523 టీఎంసీల మేర వరద ఎగువనుంచి వచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. స్థానిక అవసరాలకుపోను మిగిలిన 142.783 టీఎంసీల మేర జలాలను ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిపెట్టారు. మరోవైపు మంజీరానది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సాలూరా వద్ద అంతర్రాష్ట్ర వంతెన నీట మునిగింది.
నిజామాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జీవనది అంటేనే అనేకనేక నదులు, ఉప నదులు, వాగులు, వంకల సంగమం. సజీవ జలధారతో నిత్య ప్రవాహంతో కనిపించే అతి పెద్ద నది గోదావరి మాత్రమే. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద జీవనదిగా గుర్తింపు పొందిన గోదావరి ఏడేండ్ల తర్వాత మహోగ్ర రూపంలో ప్రవహిస్తున్నది. ఊహించని విధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు తీర ప్రాంతంలోని పొలాలను ముంచేస్తూ కదులుతున్నది. దాదాపుగా నది తీర ప్రాంతంలో ఒడ్డు కనబడకుండా ఉగ్రరూపంలో వరద పోటెత్తుతుండడంతో ప్రజలంతా నివ్వెరపోతున్నారు. 2015 పుష్కరాలకు ముందు కనిపించిన జీవనది ఉగ్ర ప్రవాహం మళ్లీ ఇప్పుడు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అతి భారీ వానలకు తెలంగాణలోనూ కురుస్తున్న జోరు వానలు తోడవ్వడంతో గోదావరి ఉరకలేస్తున్నది. వానకాలం 2021 ఆరంభం నుంచి నేటి వరకు శ్రీరాంసాగర్‌కు 205.523 టీఎంసీలు మేర వరద వచ్చింది. స్థానిక అవసరాలు, ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం అనంతరం 142.783 టీఎంసీలు మేర దిగువకు వదిలి పెట్టడం విశేషం.
మరాఠా నేల నుంచి తెలుగు నేల వైపు..
భారీ వరదతో ఉప్పొంగుతోన్న గోదావరి నది సుదూర ప్రాంతాల నుంచి ఉరకలేస్తూ కదులుతున్నది. తెలంగాణలో గోదావరి నది రెండు చోట్ల వివిధ ఉప నదులతో సంగమిస్తున్నది. నిజామాబాద్ జిల్లా కందకుర్తి ఒకటి కాగా మరోటి కాళేశ్వరం. జీవనది గోదావరి పవిత్ర స్థలాలను తాకుతూ వడివడిగా తెలంగాణ నేలపై ప్రవేశించేది నిజామాబాద్ జిల్లా నుంచే. మరాఠా నేల నుంచి ప్రవహించే గోదావరి, కన్నడ నుంచి పరుగెత్తుకొచ్చే మంజీర, తెలంగాణ నేల నుంచి పుట్టి ప్రవేహించే హరిద్ర ఈ మూడు నదులు ఒకే చోట కలిసే ప్రాంతమే కందకుర్తి. గోదావరి తన జన్మస్థలం నుంచి బంగాళాఖాతంలో సంగమించే వరకూ సుమారు 14 ఉపనదులను తనలో కలుపుకొంటుండగా నిజామాబాద్ జిల్లాలోనే రెండు ఉపనదులుండడం ప్రాముఖ్యతను సంతరించుకున్నది. గోదావరికి మంజీర, హరిద్ర ఈ రెండు ఉపనదులు కుడివైపు నుంచి వచ్చి కలుస్తుండడం మరో విశేషం. పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరినది 1400 కిలో మీటర్ల ప్రయాణమంతా పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు వెళ్తుంది. అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర్లోని త్రయంబకం వద్ద జన్మించి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా గుండా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
దిగువకు 140 టీఎంసీలు..
వానకాలం ప్రారంభమైన మొదటి నెల నుంచే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు సగం మేర నీళ్లతో ఉండగా జూన్ నెలలో కురిసిన భారీ వానలతోనే నిండుకుండలా మారింది. దీంతో జూలై నుంచి వరుసగా గేట్లు ఎత్తడం, మూయడం ఈసారి క్రమంగా పెరుగుతూ వచ్చింది. భారీగా వర్షాలు కురిస్తే గేట్లు తెరవాల్సిన అనివార్యత ఈసారి ఎస్సారెస్పీ వద్ద చోటుచేసుకున్నది. జూన్ 1వ తేదీ నుంచి నేటి వరకు ఎస్సారెస్పీకి 205.523 టీఎంసీలు మేర వరద వచ్చింది. ఇందులో స్థానికంగా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగం అయ్యాయి. మరిన్ని జలాలు వివిధ కాలువల ద్వారా ఆయా చెరువుల్లోకి మళ్లించారు. అంతేకాకుండా వృథా నీటిని జెన్కో జల విద్యుత్ కేంద్రం గుండా మళ్లించి విద్యుత్ ఉత్పత్తికి వాడారు. ఇలా వృథా నీటి వినియోగంతోపాటుగా ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం అనంతరం 140.783 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్, జులై, ఆగస్టుతోపాటుగా సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇంత భారీ స్థాయిలో నీళ్లను వదలడం రికార్డుగా ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.
సుజల ప్రవాహం..
ఏడాది పొడవునా గోదావరి నది ఈసారి జలజీవంతో సందడి చేసింది. ఓ వైపు ఎస్సారెస్పీలో మే నెలాఖరు వరకు 40 టీఎంసీలు మేర నీటి నిల్వ ఉండడంతో పశ్చిమ దిశలో నిజామాబాద్ ప్రారంభ సరిహద్దు వరకు బ్యాక్ వాటర్ విస్తరించింది. తద్వార మండుటెండల్లోనూ నదిలో నీళ్లతో గోదావరి కొత్తందాలతో ప్రజలకు కనువిందు చేసింది. 2020 వానకాలం అనుకూలించడంతోపాటుగా వరుసగా 2021లోనూ ముందస్తుగానే వరుణుడు దంచి కొట్టడంతో వరద తీవ్రస్థాయిలో చేరింది. జూలై 1 నాటికి బాబ్లీ గేట్లు ఎత్తాల్సి ఉండగా ఎగువ మహారాష్ట్రలో వరద తాకిడిని నియంత్రించలేని పరిస్థితిలో అక్కడి సర్కారు జూన్‌లోనే పలు మార్లు దిగువకు నీళ్లను వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇక జూన్ మొదటి వారంలో మొదలైన వానలు జోరుగా కురవడం, అదే రీతిలో జూలై, ఆగస్టులోనూ భారీ నుంచి అతి భారీ వానలతో గోదావరి పులకరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షంతో ఓ వైపు మంజీర, మరోవైపు గోదావరి నదులు పలుమార్లు వరదతో పోటెత్తాయి. కందకుర్తి వద్ద సంగమిస్తూ భారీగా ప్రవాహాన్ని ఎత్తుకొని ముందుకు కదిలాయి.
భయం గుప్పెట్లో కందకుర్తి
రెంజల్, సెప్టెంబర్ 8: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రతోపాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా నీరు ప్రవహిస్తున్నది. మంగళవారం సాయంత్రం వరకు కందకుర్తి వంతెనను తాకుతూ ప్రవహించిన వరద రాత్రికి రాత్రే కందకుర్తి గ్రామాన్ని చుట్టేసింది. బుధవారం తెల్లవారుజామున నీరు ఉధృతంగా పారి వంతెన పైనుంచి హెచ్చరిక స్థాయిలో పొంగి పొర్లుతున్నది. గంట, గంటకూ వరద ప్రవాహం పెరగడంతో బుధవారం సాయంత్రం కందకుర్తి గ్రామ శివారులోని మూల మలుపు వరకు నీరు వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అంతరాష్ట్ర రహదారిని మూసివేశారు. గ్రామస్తులెవరూ ఇంటి నుంచి బయటికి రావొద్దని చాటింపు వేశారు. వంతెన వైపు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రమాదంలో అంతర్రాష్ట్ర వంతెన..
రెంజల్ మండలం కందకుర్తి సమీపంలోని త్రివేణి సంగమ క్షేత్రం వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం 1983 సంవత్సరంలో హైలెవల్ వంతెన నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. గతంలో తరుచుగా వరదలు రావడం, వంతెన నిలుపుదల కాలపరిమితి ముగిసినా రాకపోకలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లోపంతో వరద ప్రవహించే సమయంలో వంతెన పైనుంచి రాకపోకలు సాగించేందుకు వాహనదారులు జంకుతున్నారు. వంతెన పైనుంచి గోదావరి ప్రవహించడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు.
ఆరేండ్ల తర్వాత ..
వానకాలంలో కురిసే వర్షాలకు వంతెనను ఆనుకొని, శివాలయం నీట మునిగి వరద ప్రవహించడం సాధారణం. కానీ రెండు రోజులుగా కురిసిన వర్షంతో ఊరు చుట్టూ నీరు చేరడంతో ఆరేండ్ల క్రితం వచ్చిన వరద ముప్పు గుర్తుకు వస్తున్నది.
-కాలప్ప, కందకుర్తి, గ్రామ రైతు
చేతికి వచ్చిన పంట నీటి పాలైంది..
20 ఎకరాల్లో సాగు చేసిన సోయా చేతికి వచ్చే సమయంలో వరద రూపంలో కొట్టుకుపోయింది. అధికారులు పంటను పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.