నగరంలో మొదలైన వినాయక చవితి సందడి
విగ్రహాల కొనుగోళ్లలో యువత నిమగ్నంఇందూరు, సెప్టెంబర్ 8:
వినాయక చవితి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. గణపతి విగ్రహాల కొనుగోళ్లలో ప్రధానం యువత నిమగ్నమయ్యారు. గణేశ్ మండపాలను నిర్మించుకుంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆకర్షణీయమైన గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. నిజామాబాద్ నగరంలో సైతం గణపతి విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. కంఠేశ్వర్ బైపాస్ రోడ్, పెద్దబజార్, పూలాంగ్, రాజరాజేంద్ర చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల దుకాణాల వద్ద సందడి మొదలైంది. ఒక్క ఫీట్ నుంచి సుమారు 20 ఫీట్ల సైజ్ వరకు గణపతులు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
మండపాల వారు పాటించాల్సిన నియమాలు
గణేశ్ మండపాల నిర్వాహకులు పలు నియమాలు పాటించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గణేశ్ విగ్రహం కోసం ఎవరి వద్ద బలవంతపు వసూళ్లు చేయొద్దు. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
గణేశ్ మండళ్లను సందర్శించే మహిళలు, యువతులపై ఈవ్‌టీజింగ్ జరగకుండా నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలి.
డీజే, సౌండ్ బాక్సులతో ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు. రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి.
డీజేపై నిషేధం విధించారు. మైక్ పర్మిషన్ కోసం సంబంధిత ఏసీపీ నుంచి అనుమతి తీసుకోవాలి.
విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలి. గణేశ్ మండపాల కోసం విద్యుత్ శాఖ వద్ద అనుమతితో కనెక్షన్ పొందాలి. నాణ్యమైన విద్యుత్ తీగను ఉపయోగించాలి.
ప్రతి మండపం వద్ద ఉదయం, రాత్రివేళల్లో ముగ్గు రు కార్యకర్తలను ఉంచాలి. పోలీసు సిబ్బంది తనిఖీకి వచ్చిన ప్రతిసారీ కనబడాలి.
అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
గణేశ్ మండలి పూర్తి వివరాలు, నిమజ్జనం ఏ రోజు చేస్తారు, ఎక్కడ చేస్తారనే వివరాలు పోలీసులకు తెలపాలి.
యువకులు కోపతాపాలకు పోకుండా సంయమనం పాటించాలి. పుకార్లు నమ్మొద్దు.
గణేశ్ మండపాల వద్ద పేకాట ఆడొద్దు, ఉత్సవాల్లో పటాకులు పేల్చడం నిషేధం.
పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలి.
కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
గణేశ్ మండపాలకు విద్యుత్ చార్జీలు
1 కిలోవాట్స్ వరకు రూ.1500
1 నుంచి 1.5 కిలోవాట్స్ వరకు రూ.2100
1.5 నుంచి 2 కిలోవాట్స్ వరకు రూ.2800
2 కిలోవాట్స్ లోడ్ తర్వాత రూ.2800లతో ఒక్కో కిలోవాట్‌కు రూ.1500 చార్జీ చేస్తారు.
అమ్మకాలు పెరిగాయి
గత సంవత్సరం కరోనాతో గిరా కీ లేదు. ఈ సంవత్సరం బాగానే ఉంది. గ్రామాల నుంచి వచ్చి గణపతులను కొనుగోలు చేస్తున్నారు. రూ. 20 నుంచి రూ.20వేల ధరల్లో విగ్రహాలు అందుబాటులో ఉన్నా యి. ఏటా గణపతులు విక్రయి స్తాం. పది రోజుల్లో అమ్మిన గణపతుల డబ్బులతో సంవత్సరమంతా మా కుటుంబాన్ని పోషించుకుంటాం.
-యువరాజ్, వ్యాపారి