
ఉద్యమ పార్టీ టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతోపాటు పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారు. బలమైన రాజకీయ శక్తిగా ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్కు ఇప్పటివరకు సొంత భవనం లేదు. పార్టీ కార్యకలాపాలు, ప్రజాసమస్యలపై చర్చించడానికి వేదికలేక కిరాయి గదుల్లో నేతలు సమావేశాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రాల్లో టీఆర్ఎస్ కార్యాలయ భవనాలను నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందులోభాగంగా నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో మినీ తెలంగాణ భవన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టడం విశేషం. అన్ని సౌకర్యాలతో 8,352 చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనం.. జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలకు వేదికగా నిలువనున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కంచుకోటగా వెలుగొందుతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. పార్టీ ఆవిర్భావ వేళలోనూ పాత నిజామాబాద్ జిల్లా ప్రజలు అందించిన ఉద్యమ స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఒక్కడై కదిలిన నాటి ఉద్యమ సారథి, ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు నైతిక మద్దతు, రాజకీయ ప్రోత్సాహాన్ని ఇచ్చిన గడ్డ ఇదీ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఖిల్లా గోడలపై రాసిన దాశరథి అక్షర స్ఫూర్తితో ఇందూరు ప్రజలంతా కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తూనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రారంభమైన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి నిలిచింది. 2001లో పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే రెండు జడ్పీ పీఠాలను కైవసం చేసుకోగా, ఇందులో నిజామాబాద్ జిల్లా ఒకటి. నాటి నుంచి ఇప్పటి వరకూ క్లిష్ట పరిస్థితుల్లోనూ కేసీఆర్‌కు అండగా నిలిచిన ఈ ప్రాంతం అనేక సందర్భాల్లోనూ ప్రత్యేకతను చాటుకుంది. ఒకప్పుడు కిరాయి గదుల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకున్న టీఆర్ఎస్కు నాటి కాంగ్రెస్ పాలకులు అనేక ఇబ్బందులకు గురి చేశారు. పార్టీ కార్యకలాపాలకు ఆటంకాలు సైతం తలపెట్టారు. నేడు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా మినీ తెలంగాణ భవన్‌ను గులాబీ దళపతి కేసీఆర్ తీర్చిదిద్ది త్వరలో ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
8,352 చదరపు అడుగుల విస్తీర్ణం…
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నమూనాను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆమోదించారు. ఒకే రకమైన పార్టీ కార్యాలయాలనే రాష్ట్రమంతటా నిర్మిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో మినీ తెలంగాణ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. దీని వైశాల్యం 8,352 చదరపు అడుగుల్లో విస్తరించింది. ఇందులో వివిధ విభాగాలను విభజించారు. పార్టీ కార్యాలయాన్ని సెపరేటుగా నిర్మిస్తున్నారు. పార్టీ ఆఫీసు విస్తీర్ణం 2,537 చదరపు అడుగులుగా ఉంది. దీని పక్కనే మీటింగ్ హాలును నిర్మిస్తున్నారు. విశాలంగా ఉన్న సమావేశం హాలులో వందలాది మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవచ్చు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలకు ఈ భవనం వేదికగా నిలువనుంది. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు సమావేశ మందిరం ఉపయోగపడనుంది. మీటింగ్ హాలు వైశాల్యం 4,712 చదరపు అడుగులుగా తీర్చిదిద్దారు. ఆ పక్కనే 489 చదరపు అడుగుల్లో కిచెన్ షెడ్డును నిర్మించారు. మూత్రశాలలకు 233 చదరపు అడుగులు, వాచ్మెన్ గదులకు 390 చదరపు అడుగుల స్పేస్‌ను కేటాయించారు. ఇవన్నీ కలుపుకొంటే సుమారు ఎకరం స్థలంలో 8352 చదరపు అడుగుల మేర నిర్మాణ స్థలం అందుబాటులోకి వచ్చింది.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
స్వరాష్ట్ర సాధనకు ముందు, ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నిలుస్తోంది. జాతీయ పార్టీలు నిత్యం హడావుడి చేస్తున్నప్పటికీ ఢిల్లీ కేంద్రంగా వచ్చే ఆదేశాలను పాటిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కుతున్నాయి. అదీ కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలైనా వీరి ఎజెండా ఎల్లప్పుడు ఉత్తరాది పెద్దల కనుసన్నల్లోనే కొనసాగుతుంది. ఇతర పార్టీలేవైనా వారి ఆలోచనలు, ఉద్దేశాలన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టవు. రాష్ర్టాన్ని తెచ్చిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతి అడుగులో ఉద్యమ స్పూర్తితోనే ముందడుగు వేస్తుంటారు. రాజకీయ వ్యూహాలు ఎన్ని రచించినా అవన్నీ తెలంగాణ ప్రజల మౌలిక అవసరాల చుట్టే తిరుగుతుంటాయి. జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు రూ.60 లక్షలతో చేపట్టారు. వీటి నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. గులాబీ రంగులో మినీ తెలంగాణ భవన్ మెరిసిపోవడంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంతో పార్టీ కార్యాలయం శోభిల్లుతోంది. పచ్చిక బయళ్లు, విశాలమైన గదులు, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక కార్యాలయం వంటి సౌకర్యాలు ఆకట్టుకుంటుండడం విశేషం. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ మాదిరిగానే జిల్లా పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.