
నందిపేట్, (మాక్లూర్): మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో మూడు రోజుల క్రితం ఓ మహిళ దారుణ హత్యకు గురికాగా, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముల్లంగి శివారులోని పంటపొలాల్లో దారుణంగా హత్య చేసి అనుమానం రాకుండా ఒంటిపై పెట్రోల్‌పోసి నిప్పంటించగా శరీరం గుర్తుపట్టలేనంతగా కాలిబూడిదయ్యింది. కేవలం కాలుకు ఉన్న మట్టెల ఆధారంగా హత్యకు గురైంది మహిళ అని గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా హత్యకు గురైన మహిళ మండలంలోని బొంకన్పల్లి గ్రామానికి చెందిన గద్దల రాణి (34)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలుకోణాల్లో విచారణ చేపట్టగా.. కట్టుకున్నోడే కడతేర్చాడనే అనుమానాలు బలపడుతున్నట్లు తెలిసింది. రాణి భర్త గద్దల గణేశ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నిజామాబాద్‌లో ఉండగా, రెండో భార్య రాణి ఇంటర్ చదివే తన కూతురు ప్రణతితో కలిసి బొంకన్‌పల్లిలో నివసిస్తోంది. రాణి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తోంది. రాణిపై భర్త గణేశ్ ఎప్పుడూ అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడని తెలిసింది. కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరగుతున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే గణేశ్ మద్యానికి బానిసై నిత్యం మత్తులో ఉండేవాడని, అదే మత్తులో ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూతురు ప్రణతి, గ్రామస్తులు కలిసి గణేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానితుడు గణేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.