నిజామాబాద్ లీగల్, అక్టోబర్ 2 : ప్రతి పౌరుడికీ న్యాయ విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 44 రోజుల పాటు గ్రామగ్రామాన న్యాయ చైతన్య సదస్సులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలను కలుసుకొని చట్టాలపై అవగాహన కల్పిస్తూ, హక్కులు, బాధ్యతలను జనసమాజానికి తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్‌లో పాన్ ఇండియా అవగాహన, విస్తరణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. 75 ఏళ్లు స్వాతంత్య్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చట్టాల అమృత్ మహోత్సవానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పోలీసు శాఖతో పాటు 40 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. దళిత, గిరిజన, ఆదివాసీ, మహిళలు, ఆర్థిక స్థోమత లేని వారు, బడుగు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నామని తెలిపారు. అంతిమంగా ప్రజలకు చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమాన్ని విజయవతం చేసేందుకు పౌరసమాజం సహకరించాలని కోరారు.
డీసీపీ అరవింద్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా ప్రచార కార్యక్రమానికి పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. పాన్ ఇండియా ఉన్నతమైన కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వశాఖ భాగస్వామ్యమవుతుందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. పాన్ ఇండియా ఉద్దేశాలు, లక్ష్యాలు, ప్రచార కార్యక్రమాలను న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, ప్యానల్ న్యాయవాదులు మాణిక్‌రాజ్, జగన్మోహన్గౌడ్, దాసరి పుష్యమిత్ర, పిల్లి శ్రీకాంత్, ఆశనారాయణ, వెంకటేశ్, డీఎంహెచ్‌వో బాలనరేంద్ర, రెడ్‌క్రాస్ ప్రతినిధులు తోట రాజశేఖర్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.