రైతును కుదేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఏటా పత్తి గింజలపై పెరుగుతున్న ఆర్థిక భారం
విత్తన కంపెనీలకు లాభం చేకూరుస్తున్న మోదీ సర్కారు నిర్ణయాలు
నిజామాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం సేకరణ విషయంలో కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన కేంద్రప్రభుత్వం తాజాగా పత్తి విత్తన ధరలను పెంచి అన్నదాతపై అదనపు భారాన్ని మోపింది. వచ్చే వానకాలం సీజన్‌కు బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ.810లకు పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఇంధన ధరలను పెంచడంతో పంటలు సాగు చేసే రైతులకు ఖర్చులు పెరిగి పోయాయి. కేంద్రం తీరుతో రాష్ట్రప్రభుత్వం ఇతర పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం పత్తి విత్తన ధరలనూ పెంచి.. రైతులపై మోయలేని భారాన్ని మోపుతున్నది.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏటా రైతులు కుదేలవుతున్నారు. విత్తన కంపెనీల ఒత్తిడికి తలొగ్గి దేశంలోని కోట్లాది మంది రైతుల పొట్ట కొడుతున్నది. ఓ వైపు ఇంధన ధరల ను అమాంతం పెంచేసి రికార్డు స్థాయికి తీసుకొచ్చింది. ఫలితంగా వ్యవసాయ పనుల్లో పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతున్నది. మోదీ సర్కారు తీరుతో ఇప్పటికే సాగు ఖర్చులు పెరుగుతుండగా తాజాగా పత్తి గింజలపై ధరలను అమాంతం పెంచడంతో కర్షకలోకం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో యాసంగి సీజన్ నుంచి వరి కాకుండా ఇతర పంటల సాగుకు రైతు లు ఉత్సాహం చూపుతున్నారు. ఈ దశలో నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో చాలా మంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. వానకాలంలో తెల్ల బంగారం సాగు చేయాలని ఆలోచనలో పడ్డారు. అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లే విధంగా కేంద్రం తీసుకున్న ధరల పోటుతో వెనక్కి తగ్గే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ప్రస్తుతం తెల్ల బంగారం క్వింటాలుకు రూ.10వేలు వరకు పలుకుతున్నది. ఈ దశలో రైతుల ఆసక్తిని మోదీ సర్కారు తీవ్రంగా దెబ్బతీసింది.
కోట్లలో పెంపు భారం…
వచ్చే జూన్ నుంచి మొదలయ్యే వానకాలం సీజన్‌కు బీజీ2 పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ. 810లకు పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పత్తి గింజల ధరలు 2022-23 సంవత్సరానికి వర్తించనున్నాయి. పత్తి గింజ ధరల పెంపు ప్రభావం ఉమ్మడి జిల్లా రైతులపై తీవ్రంగా ప్రభావం చూపనున్నది. గతేడాది 475 గ్రాములు బీజీ-2 పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.767 ఉండగా ఈసారి రూ.43 అదనంగా పెంచారు. 2020-21 సంవత్సరానికి వచ్చే సరికి రూ.37 అదనంగా పెంచి రూ.767 చేశారు. ఇప్పుడు మళ్లీ రూ.810కి పెంచారు. బీజీ-1 విత్తన ధరల జోలికి పోకపోయినప్పటికీ రాష్ట్రంలో బీజీ-2 విత్తనాలు మాత్రమే రైతులు వినియోగిస్తారు. ఎకరానికి రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయి. దీంతో ఎకరం విస్తీర్ణంలో సాగు చేసే రైతుకు విత్తన ఖర్చు రూ.1620 అవుతుంది. రైతులపై కేంద్ర ప్రభుత్వం మోపుతున్న విత్తన ధరల పిడుగుతో కర్షకులు కుదేలయ్యే ఆస్కారం ఏర్పడింది. పత్తి విత్తనాల ధర పెంచొద్దని రాష్ట్ర ప్రభు త్వం గతంలోనే లేఖ రాసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రైవేటు విత్తన కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి కర్షకుల ప్రయోజనాలను మోదీ సర్కారు తాకట్టు పెట్టిందంటూ రైతులు మండిపడుతున్నారు.
తళుక్కుమంటున్న తెల్ల బంగారం…
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు సంబంధం లేకుండానే బహిరంగ మార్కెట్లో పత్తి ధర ఈసారి అమాంతం ఆకాశాన్ని తాకుతున్నది. ప్రైవేటు ట్రేడర్లు పోటీ పడి రైతుల నుంచి పత్తికి అత్యధిక ధరను వెచ్చించి సేకరిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొన్నటి వరకు రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాలుకు రూ.9500 వరకు రైతులు దక్కించుకున్నారు. ప్రైవేటు వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి పత్తిని సేకరించడం మూలంగా రవాణా ఖర్చులు సైతం తప్పినట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించింది. సర్కారు అందించిన సలహాలు, సూచనలు పాటించిన వారంతా ఇప్పుడు సంతోషంగా మద్దతు ధరను దక్కించుకుంటున్నారు. భారత పత్తి సంస్థ(సీసీఐ) ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తి క్వింటాలుకు కేవలం రూ.6025 మాత్రమే ఉండగా ప్రైవేటు వ్యాపారులు మాత్రం డబుల్ రేటుకు పత్తిని కొంటుండటం విశేషం. ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొన్నటి సీజన్లో భారీగా పత్తి సాగైంది. వీరంతా శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకున్నారు.
వానకాలంపైనే ఆసక్తి…
ప్రస్తుతం మార్కెట్లో తెల్ల బంగారానికి మంచి ధర వస్తుండడంతో చాలా మంది రైతులు పత్తి సాగుకు ఉత్సాహం చూపుతున్నారు. వానకాలం సీజన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారందరిపై విత్తన ధరల పెంపు ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గే ఆస్కారం ఏర్పడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలంటూ రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసి చేతి నిండా ఆదాయం పొందాలని కోరుతున్నది. రాష్ట్ర సర్కారు చెప్పినట్లే ఇతర పంటల సాగుకు మొగ్గు చూపిన వారందరికీ నేడు లాభాలు దరి చేరుతున్నాయి. ఈ దశలోనే ప్రభుత్వం ఆదేశించిన బాటలోనే నడించేందుకు సాగుదారులు సిద్ధం అవుతోన్న వేళ కేంద్రం దొడ్డిదారిలో విత్తన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్న సాగు రంగాన్ని ఆదుకోవాల్సిన ప్రధాని మోదీ… అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం శోచనీయమంటూ రైతులు ఆక్షేపిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పత్తి పంట సాధారణ సాగు 60వేల ఎకరాలు కాగా ఈసారి లక్ష ఎకరాల్లో పత్తి పంట సాగు అయ్యే ఆస్కారం ఉంది.
ధర పెంపుతో భారం పడుతుంది
మద్నూర్, మార్చి 18 : కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో మాపై తీవ్ర భారం పడుతుంది. ఇప్పటికే ఇంధన ధరలతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. విత్తనాల ధరలు పెరగడంతో పంట గిట్టుబాటు కాక నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.
–నాగనాథ్, రైతు