Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి సమయంలో ఉపాసన ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభవార్తతో మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉపాసన ప్రసవం జరిగిన అపోలో హాస్పిటల్‌లోని వాతావరణం, వైద్యుల స్పందనలు, కుటుంబ సభ్యుల భావోద్వేగ క్షణాలు, అభిమానుల ఆనందం వంటి ఎన్నో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
చరణ్, ఉపాసన కలిసి ఆస్పత్రికి చేరిన దృశ్యాలు, డెలివరీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా మాట్లాడిన సందర్భాలు, ఆస్పత్రి బయట అభిమానులు చేసిన హర్షధ్వానాలు, స్వీట్లు పంచిపెట్టడం వంటి క్షణాలను కూడా ఈ వీడియోలో చూపించారు.వీడియోలో ఉపాసనకు వైద్యం అందించిన పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఆమె ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అపోలో హాస్పిటల్‌ను తన ఇంటిలా భావిస్తూ ఎంతో కంఫర్ట్‌గా ఉండేదని చెప్పారు. మొదటిసారి అడ్మిట్ అయిన గదిలోనే ఈసారి కూడా చేరడం తమకు ఒక సెంటిమెంట్లా అనిపించిందని వైద్యులు వెల్లడించారు. తల్లి, పిల్లల ఆరోగ్యం దృష్ట్యా రెండు ప్రత్యేక మెడికల్ టీమ్స్ పనిచేశాయని, ఒకటి హైదరాబాద్ అపోలో నుంచి, మరొకటి చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చి మొత్తం ప్రాసెస్‌ను పర్యవేక్షించాయని చెప్పారు.
కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ తల్లి, పిల్లలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే రామ్ చరణ్ ఉపాసనపై ఎంతో ప్రేమ చూపిస్తాడని, అదే మమకారం పిల్లలపై కూడా చూపిస్తాడని చెప్పిన వైద్యులు ఈ జంట ముగ్గురు పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక ఈ వీడియోలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు కూడా మాట్లాడారు. తాను డెలివరీకి అనుకూలమైన తేదీ, సమయాన్ని సూచించానని, జనవరి 31 రాత్రి 11.30 తర్వాత మంచి ముహూర్తమని చెప్పానని తెలిపారు. ఆ జంట కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేశానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యుల పర్యవేక్షణతో పాటు జ్యోతిష్య సలహాలను కూడా పాటిస్తూ ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి, ఇద్దరు శిశువులు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సంతోషకర సందర్భం మెగా కుటుంబానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా ఒక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చింది.