అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి
న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు
నిజామాబాద్‌లో ప్రత్యేక పోక్సో కోర్టును ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి
నిజామాబాద్ లీగల్, మార్చి 5 : ప్రతి పేదవాడి దరికి న్యాయసేవలు చేరాలని, అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి సూచించారు. కొవిడ్, లాక్డౌన్ తరువాత నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసుకుని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని న్యాయస్థానాలు తమ పని విధానాలు మార్చుకోవాలన్నారు. కరోనా కష్టకాలంలో దిగువ కోర్టుల్లోని న్యాయాధికారులు అత్యుత్తమమైన న్యాయసేవలందించారని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని కోరారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి దివంగత చిన్నపరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చట్టాల్లో వచ్చే మార్పులు, సవరణలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయార్థులకు సేవలందించడంలో అత్యుత్తమ పని తీరు కనబరుస్తున్నారని అభినందించారు.
ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల మాట్లాడుతూ ప్రతి న్యాయస్థానం న్యాయ విచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తున్నాయన్నారు. సమావేశానంతరం దివ్యాంగులకు వీల్ చైర్స్, ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ సీపీ నాగరాజు, అదనపు జిల్లా జడ్జిలు గౌతం ప్రసాద్, షౌకత్ జహన్ సిద్ధిఖీ, రమేశ్‌బాబు, పంచాక్షరి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, సీనియర్ సివిల్ జడ్జిలు కిరణ్మహి, శివరాంప్రసాద్, వి.శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, సౌందర్య, భవ్య, అజయ్‌కుమార్ జాదవ్, గిరిజ, అపర్ణ, షాలినీ, గౌస్‌పాషా, దీప్తి, స్వామి, హారిక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, దాసరి పుష్యమిత్ర, మాణిక్‌రాజ్, ఆశ నారాయణ, యెండల ప్రదీప్, జగన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక పోక్సో కోర్టు ప్రారంభం
పిల్లలపై లైంగిక దాడుల కేసులను విచారించే ప్రత్యేక పోక్సో కోర్టును నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఫాస్ట్‌ట్రాక్ భవనంలో హైకోర్టు జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, సీపీ నాగరాజు, ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పంచాక్షరి, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
న్యాయవ్యవస్థకు న్యాయవాదులు పునాదులు
విద్యానగర్,మార్చి 5 : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని, సత్వర న్యాయానికి కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పా టు చేస్తామని తెలిపారు. అంతకుముందు హైకోర్టు జడ్జి విజయ్‌సేన్‌రెడ్డికి అదనపు జిల్లా జడ్జి రమేశ్ బాబు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, కలెక్టర్ జితేశ్ పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతి, సీనియర్ న్యాయవాదులు రామచంద్రారెడ్డి, జగన్నాథం, శంకర్‌రెడ్డి, వెంకట్ రామ్‌రెడ్డి, నంద రమేశ్, నిమ్మ దామోదర్‌రెడ్డి, గంగాధర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.