ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రంలో 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
15 ఏండ్ల తరువాత రికార్డు
ఈ నెలాఖరు వరకు మరింత పెరిగే అవకాశం
ఆనందంలో అధికారులు, సిబ్బంది
మెండోరా, మార్చి 5 : ఎస్సారెస్పీ జల విద్యుత్ కేంద్రం రికార్డు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం కాగా 100 మిలియన్ యూనిట్లు దాటింది. 15 ఏండ్ల తరువాత మళ్లీ వంద మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గమనార్హం. పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి 35 ఏండ్లు అవుతున్నది. ఇప్పటి వరకు 13 సార్లు మాత్రమే 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. మార్చి నెలాఖరు వరకు కాకతీయ కాలువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో మరింత విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీ జల విద్యుత్ కేంద్రం రికార్డు సాధించింది. 15 ఏండ్ల తరువాత మళ్లీ వంద మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గమనార్హం.2021-22 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ యూనిట్లు కాగా 100 మిలియన్ యూనిట్లు దాటడంతో అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు అనుసంధానంగా జలవిద్యుత్ ఉత్పత్తి కేం ద్రంలో మొదటి యూనిట్‌ను 1987 జూలై 12న ప్రా రంభించారు.కాకతీయ కాలువ నీటి విడుదలను వినియోగించుకొని తొలిసారిగా విద్యుత్ ఉత్పత్తి చేశారు. అదే సంవత్సరం రెండో యూనిట్ ఏర్పాటుచేసి అక్టోబర్ 24న ప్రారంభించారు. 1988 మార్చి31న మూడో యూనిట్‌ను ప్రారంభించారు. నాల్గో యూనిట్‌ను 2010 అక్టోబర్ 12న ప్రారంభించారు. నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసేలా కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఒక్కో టర్బయిన్ నుంచి తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. నాలుగు టర్బయిన్ల నుంచి 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి 35 ఏండ్లు అవుతున్నది. కాకతీయ కాలువతో ఆయకట్టుకు వానకాలం, రబీ పంటలకు నీటి విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల నుంచి వరదలు వచ్చినపుడు కాకతీయ కాలువతో దిగువన ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, చెరువులతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న మానేరు డ్యాం నింపేందుకు నీటిని విడుదల చేస్తారు. కాలువలకు నీటివిడుదల సమయం లో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 35 ఏండ్లలో 13 సార్లు మాత్రమే 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2006 తరువాత ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు తెలిపారు. 2021-22లో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ యూనిట్లు కాగా 100 మిలియన్ యూనిట్లు దాటినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులను అభినందించారు. మార్చి నెలాఖరు వరకు కాకతీయ కాలువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో మరింత విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రానికి 1080.20 అడుగుల (52.968 టీఎంసీలు) వద్ద ఉందని తెలిపారు.