బోధన్, మే 4: రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్న నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో వ్యాపార, వాణిజ్య రంగాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. చిరు వ్యాపారుల జీవితాల్లో అంధకారాన్ని పారద్రోలే విధంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో విద్యుత్ సంస్థలు నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్నాయి. టిఫిన్ సెంటర్లు, పిండి గిర్నీలు మొదలు దుకాణాలు, కూల్‌డ్రింక్ షాప్‌లు, జిరాక్స్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, మిఠాయి దుకాణాలు.. ఇలా ఒకటేమిటి.. చిన్న దుకాణం మొదలు పెద్ద మాల్స్ వరకు అన్నింటికీ నిరంతరం విద్యుత్ అందుతున్నది.
పెనుగాలులు వీచినప్పుడో, అనివార్యమైన సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పుడో తప్ప వ్యాపార, వాణిజ్య యూనిట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది. అంతరాయం కలిగిన సందర్భాల్లో సైతం విద్యుత్ సిబ్బంది చొరవచూపి.. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్న తీరు అభినందనీయమని చెప్పవచ్చు. పక్కాగా కరెంట్ సరఫరా ఉండడంతో వ్యాపారాలు చేసుకునేవారికి జనరేటర్లు, ఇన్వర్టర్లతో పనిలేకుండా పోయింది. పవర్ కట్ అనేది లేకపోవడంతో వ్యాపార, వాణిజ్యాల్లో ఘననీయమైన వృద్ధి కనిపిస్తున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, ముందుచూపుతోనే సాధ్యమైందని వ్యాపారులు చెబుతున్నారు.
నాడంతా ఆగమాగం..
తెలంగాణ రాకముందు కరెంట్ సరఫరా ఆగమాగముండేది.. ‘కరెంట్ రాకడ.. ప్రాణం పోకడ.. ఎవరికెరుక’ అన్నట్టుగా ఉండేది. రైతులు ఇండ్లల్లో ఉండేవారే కాదు.. వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు పడేవారు.. వ్యాపారాలు చేసుకునేవారు ఉక్కబోతతో బాధపడేవారు.. కరెంట్ లేకపోతే అనేక వ్యాపారాలు నడిచే పరిస్థితి ఉండదు.. ఇక, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారైతే.. కరెంట్ లేక నష్టాలపాలయ్యేవారు. కరెంట్ కోతలు, మాటిమాటికీ సరఫరాలో అంతరాయాలతో జిరాక్స్, జ్యూస్ సెంటర్లు, పిండి గిర్నీలు, వైండింగ్, మొబైల్ షాప్‌లు, లాండ్రీలు, సెలూన్ నిర్వాహకులు పడరాని ఇబ్బందులు పడేవారు. కరెంట్ పోతే వ్యాపారం బంద్.. కరెంట్ వచ్చేసరికి.. గిరాకీలు వెనక్కి వెళ్లిపోయేవి… ఇలా అనేకమంది చిరు వ్యాపారులు తాము తెచ్చిన బ్యాంక్ అప్పులు కట్టలేక.. దివాళా తీసినవారు ఎంతో మంది ఉన్నారు.. నిజానికి ఏ వ్యాపారానికైనా నిరంతర కరెంట్ ఎంతో తోడ్పాటును అందిస్తుంది.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు పగటిపూట ఒక్కోసారి పదేసి గంటలు కూడా కరెంట్ ఉండేది కాదు. ఉదాహరణకు.. పొట్టకూటి కోసం జిరాక్స్ సెంటర్ పెట్టుకునేవాళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేది. కరెంట్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసేవారు.. జనరేటర్‌తో జిరాక్స్‌లు తీయిస్తే.. ఎక్కువ ధర అవుతుందని గిరాకీలు తిరిగి వెళ్లిపోయేవారు. మధ్యమధ్యన కరెంట్ వచ్చినా.. గిరాకీ ఉండేది కాదు.. ఇలాంటి పరిస్థితి అనేక చిరువ్యాపారాల్లో నాడు కనిపించేంది.. తెలంగాణ ఆవిర్భావం, సీఎంగా కేసీఆర్ రావడంతో రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి మారిపోయింది. తెలంగాణ వచ్చిన కొన్ని నెలలపాటు గత పాలకుల తప్పులకు ఫలితాలు అనుభవించక తప్పలేదు.
స్వరాష్ట్రంలో కరెంట్ వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం కొద్దినెలలకే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైంది. క్రమక్రమంగా అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా మొదలైంది. ఎనిమిదేండ్లలో విద్యుత్ సరఫరాలో ఆశ్చర్యకరమైన అభివద్ధిని తెలంగాణా సాధించింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ విద్యుత్ డిమాండ్ ఉన్నా.. సరఫరాలో ఆటంకాలు లేవు.. ఎక్కడా విద్యుత్ కోతలు లేవు. పొరుగున మహారాష్ట్రలో విద్యుత్ కోతలతో వ్యాపారులు సతమతమవుతుండగా.. ఇక్కడ మాత్రం పవర్ కట్స్ లేకపోవడంతో సంతోషంగా ఉన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి.
పరోక్షంగా ఉద్యోగాల కల్పన..
రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార, వాణిజ్య అవసరాలకు, ఇతరత్రా దుకాణాలు, సర్వీస్ రంగంలోని యూనిట్లకు నిరంతరం మెరుగైన విద్యుత్ అందిస్తున్నది. దీంతో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉపాధిని పొందుతున్నారు. చదువుకున్న అనేక మంది తమ సొంతకాళ్లపై నిలబడి వ్యాపారాలు చేసుకోవడానికి కరెంట్ సరఫరా ఊతమిస్తున్నది. యువకులు మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు, మొబైల్ షాపులు తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఉపాధిని పొందుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నప్పటికీ, వ్యాపారులు ఉక్కబోతకు గురికావడం లేదు. ఏసీలు, కూలర్ల కింద సేదతీరుతూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కరెంట్ రూపంలో ఉన్న కేసీఆర్‌ను దేవుడిగా భావిస్తున్నారు.
కరెంటు పోతే మధ్యాహ్నం ఇంటికే.. ఇప్పుడా పరిస్థితి లేదు..
కరెంటు కోతలు ఉండే రోజుల్లో మానాన్న కిరాణా దుకాణంలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ఎండాకాలం తాపం భరించలేక మధ్యాహ్నం దుకాణం మూసివేసి ఇంటివద్దే ఉండాల్సి వచ్చేది. గిరాకీ సమయంలో ఇంటికి రావడంతో వ్యాపారానికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మానాన్నతోపాటు నేనూ షాపులోనే కూర్చుంటున్నాను. దుకాణంలోనే కరెంటుతో ఫ్యాన్లు వేసుకుని వ్యాపారం చేస్తున్నాం. ఇంత ఎండలోనూ ఉక్కపోత లేకుండా ఫ్యాన్లు వేసుకొని పనిచేసుకుంటున్నాం. పక్క రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉంటున్నాయని, టీవీల్లో చూస్తున్నాం. మాకు ఆ పరిస్థితి లేక వ్యాపారం నిరంతరాయంగా నడిపించుకుంటున్నాం.
– బచ్చు రాహుల్ గుప్తా, కిరాణా దుకాణం యజమాని, ఎడపల్లి
దూస్రే తరఫ్సే అప్నా తరఫ్ బహుత్ అచ్చా హై..
ఆప్నా తెలంగాణమే కరెంట్ బహుత్ అచ్చాహై..దూస్రే తరఫ్సే అప్నా తరఫ్ బహుత్ అచ్చా హై.. తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండడంతో గిర్నిపైనే జీవనం కొనసాగించడం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మా కుటుంబంలోని పలువురం గిర్నీలనే నడిపిస్తున్నాం. మహారాష్ట్రలో మా బంధువులు కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలియకుండా ఉందని చెబుతున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గిర్నీ నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కోతలు లేకుండా కరెంటు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సాబ్‌కో సలాం.
– సయ్యద్ అక్బర్, పిండి, మసాలా గిర్ని యజమాని, ఎడపల్లి