అంబేద్కర్‌నగర్ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు
పెరిగిన విద్యార్థుల సంఖ్య
‘మన ఊరు – మన బడి’తో మరింత మెరుగయ్యే అవకాశం
విద్యానగర్, మార్చి 5: పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో వారికి కార్పొరేట్ చదువులను అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఆర్థికంగా వెనుకబడిన వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం మాత్రమే ఉండేది. తెలుగు మీడియం చదవడంతో పై చదువులకు వెళ్లిన సమయంలో అక్కడ ఆంగ్ల బోధన ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నది. మన ఊరు – మన బడి పేరుతో ప్రారంభించనున్న మహత్తర కార్యక్రమంతో ప్రతి పేదవాడికీ ఆంగ్ల మాధ్యమం అందనున్నది. తల్లిదండ్రులకు సైతం ఫీజుల భారం తప్పనున్నది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా, ప్రపంచ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా ఇంగ్లిష్ అవసరమనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ చదువులు అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది.
ఆంగ్ల బోధనతో సెంచరీదాటిన విద్యార్థుల సంఖ్య..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. మొద ట్లో కేవలం 25 మంది విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసించేవారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు 100కు పైగా విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించనుండడంతో విద్యార్థులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో ప్రైవేట్ పాఠశాలకు అనుగుణంగా చక్కని రంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియంలో చదివించే కల తీరుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరింత అభివృద్ధి చెందుతుంది..
గతంలో ఇంగ్లిష్ మీడి యంలో చేర్పించాలం టే కార్పొరేట్ పాఠశాల లో వేలకువేలు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే చేర్పించేవారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరగడంతోపాటు పాఠశాల కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. మున్ముందు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
–లాల్‌సింగ్, హెచ్ఎం,అంబేద్కర్ నగర్ పాఠశాల