మాక్లూర్, మే 4 : మండలంలోని అడవిమామిడిపల్లి వద్ద కొనసాగుతున్న రైల్వే ఫ్లైఓవర్ పనులను పరిశీలించేందుకు వెళ్లిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటను టీఆర్ఎస్ నాయకులు, రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బుధవారం ఉదయం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తూ మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి వద్ద జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను ఎంపీ పరిశీలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ మాస్త ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు నగేశ్, గోవర్ధ్దన్, హబీబ్, గంగాధర్ తదితరులు రైతులతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు.
హామీలు నేరవేర్చని, రైతులను మోసం చేసిన ఎంపీ గోబ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఏండ్ల తరబడి రైల్వేపనులు నత్తనడకన సాగడం, పసుపుబోర్డు హామీ, ధాన్యం కొనుగోళ్లపై అర్వింద్‌ను నిలదీసేందుకు రైల్వేబ్రిడ్జి వద్దకు వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎంపీ అర్వింద్.. పోలీసుల సూచనలతో నిజామాబాద్‌కు వెళ్లకుండా ఆర్మూర్‌కు తిరుగుపయనమయ్యారు. రైతులకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులు చేయకుండా గ్రామాల్లో తిరిగే నైతికహక్కు అర్వింద్‌కు లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ తనిఖీలు
బీర్కూర్, మే 4 : మండలంలోని బీర్కూర్, కిష్టాపూర్, వీరాపూర్ గ్రామాల్లో ఉన్న రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. గత వానకాలంలో కేటాయించిన కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించిన వివరాలను సేకరించారు. మిల్లింగ్‌చేసి ఇప్పటి వరకు ఎఫ్‌సీఐకి అందజేసిన బియ్యం, రైస్‌మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలకు సంబంధించిన అన్ని రికార్డులను వారు పరిశీలించారు. ఎఫ్‌సీఐ అధికారుల ఆకస్మిక దాడులతో రైస్‌మిల్లుల యజమానులు భయాందోళనకు గురయ్యారు.