లింగంపేట/ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి/బీబీపేట్/కామారెడ్డి రూరల్/విద్యానగర్/రామారెడ్డి, మే 4: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికివచ్చే సమయంలో చెడగొట్టు వాన అన్నదాతను ఆగం చేసింది. ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు మండలాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన గాలులకు మామిడికాయలు నేలరాలాయి. లింగంపేట మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. పోల్కంపేట, భవానీపేట గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీట మునిగింది.
ఈదురు గాలులు, వడగండ్లకు మామిడికాయలు నేల రాలాయి. ఎల్లారెడ్డి మండలంలో ఈదురు గాలులకు కోతకు వచ్చిన వరి, మక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడ్వాయి మండలంలో 43 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు గ్రామాల్లో కొంతమేర ధాన్యం తడిసిపోయింది. బీబీపేట్ మండలం జనగామలో పిడుగుపడి మూడు మేకలు, ఏడు గొర్రెలు మృతిచెందాయి. ఉప్పర్‌పల్లిలో పిడుగుపాటుకు ఓ చెట్టు కూలిపోయింది. పలు గ్రామాల్లో వరి పంటలు నేలకొరిగాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి మండలం అడ్లూర్, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో వరి, మక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీల్లో రోడ్లు జలమయం అయ్యాయి. జేపీఎన్ రోడ్ వద్ద డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరగా, మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ల సహాయంతో బురదను తొలగించారు.