నిజామాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం సీజన్‌కు రైతాంగం సన్నద్ధమవుతోంది. ఈసారి లాభదాయక పంటలు సాగు చేసే దిశగా సన్నాహాలు చేసుకుంటోంది. డిమాండ్ ఉండి, గిట్టుబాటు ధర లభించే రకాలనే పండించేలా రైతులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వ్యవసాయ శాఖ కూడా పంట మార్పిడుల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఒకే పంటను సంవత్సరాల తరబడి వేయడంతో నేల సహజ స్వభావం, భూసారం తగ్గుతుందనే విషయాన్ని రైతులకు వివరిస్తోంది. అంతర్జాతీయంగా పత్తికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు దిశగా రైతులను మరింత ప్రోత్సహించడం ద్వారా అధిక లాభాలు వచ్చే వీలుంది. అలాగే, కంది, పొద్దు తిరుగుడు వంటి లాభదాయక పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
పంట మార్పిడి విధానం అనుసరించేలా రైతులను చైతన్య పర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఒకే పంటను సంవత్సరాల తరబడి వేయడంతో నేల సహజ స్వభావం, భూసారం తగ్గుతుందనే విషయాన్ని రైతులకు వ్యవసాయ శాఖ వివరిస్తున్నది. కరోనా అనంతర పరిస్థితులతో చైనా తదితర దేశాల్లో పత్తి దిగుబడి తగ్గిపోయింది. ఈ క్ర మంలో మార్కెట్లో తెలంగాణ పత్తికి గిరాకీ పెరుగుతున్నది. క్వింటాలు పత్తి రూ.10వేల నుంచి రూ.13 వేల దాకా ధర పలుకుతున్నది. రానున్న కాలంలో మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఈ సాగు దిశగా రైతులను మరింత ప్రోత్సహించడం ద్వారా అధిక లాభాలు వచ్చే వీలుంది.
మార్కెట్లో డిమాండ్ ఉన్నందున కంది సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది. పొద్దు తిరుగుడు సాగు విస్తీర్ణాన్ని సైతం ప్రాధాన్యతాక్రమంలో పెంచేందుకు యోచిస్తున్నా రు. మొత్తంగా లాభదాయక పంటల సాగుపై ప్రత్యే క ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో పని చేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు నిరంతరం పొలా ల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వానకాలం సీజన్ మొదలవ్వబోతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సర్కారు చెబుతున్నది.
5.45 లక్షల ఎకరాల్లో పంటల సాగు…
నిజామాబాద్ జిల్లాలో వానకాలం-2022లో 5లక్షల 9వేల 398 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఇందులో 4లక్షల ఎకరాల్లో వరి, మక్కజొన్న 33,342 ఎకరాలు, సోయాబీన్ 60వేల ఎకరాల్లో ఉండొచ్చని సంబంధిత గణాంకాలు చెబుతున్నాయి. యాసంగితో పోలిస్తే వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వానకాలంలో అనుకూల వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రైతుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది లాభాలు తెచ్చే పంటలను సాగు చేయ డం ద్వారా నష్టాలకు దూరంగా ఉండొచ్చనే ఆలోచనలో రైతులు మునిగి తేలుతున్నారు. ప్రభుత్వం ఏ పంటనైనా సాగు చేయాలని చెప్పినప్పటికీ నిజామాబాద్‌లో వరికి బదులుగా ఇతర పంటలు వేస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చోపచర్చలు చేస్తున్నారు. మార్కెట్లో పత్తి, పప్పు దినుసులకు భారీ డిమాండ్ ఉన్నందున వీటి సాగుకు ఆదర్శ రైతులు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎరువుల వినియోగం ఇలా…
వానకాలం సీజన్లో ఎరువుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది. వ్యవసాయ ఇప్పటికే ప్రతిపాదించిన సాగు అంచనాల మేరకు ఎరువులను సిద్ధం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే వానకాలం పంటల సాగుకు రైతు లు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో తగు ఏర్పాట్ల లో వ్యవసాయాధికారులు బిజీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఎరువుల వినియోగం క్రమేణా పెరుగుతున్నది. గతేడాది యూరియా 59,238 మెట్రిక్ టన్నులు ఉపయోగించారు. వానకాలం- 2022 సీజన్‌కు 87,079 మెట్రిక్ టన్నులు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డీఏపీ గతేడాది 11,480 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఈసారి కూడా ఇదే స్థాయిలో అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది.
పొటాష్ గతేడాది 9,061 మెట్రిక్ టన్నులు వాడగా, ఈసారి 10,198 మెట్రిక్ టన్నులు వినియోగం కావొచ్చని చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు గతేడాది 4,112 మె ట్రిక్ టన్నులు వినియోగం కాగా ఈసారి వానకాలంలో 35,788 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని చెబుతున్నారు. సూపర్ పాస్పేట్ గతేడాది 39,618 మెట్రిక్ టన్నులు వినియోగమైంది. ఈసారి 1,131 మెట్రిక్ టన్నులు సరిపోతుందని వ్యవసాయాధికారుల అంచనాలు చెబుతున్నాయి. మద్దతు ధరకు మించి మార్కెట్లో పత్తి, కంది పంటలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో వానకాలం సీజన్లో భారీ స్థాయిలో సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సాధారణ సాగును అధిగమించేలా…
ప్రస్తుతం యాసంగిలో 7వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగైంది. మక్కజొన్న 11వేల ఎకరాల్లో, శన గ పంట 25వేల 2వందల ఎకరాల్లో, విత్తన జొన్న 42వేల ఎకరాల్లో వేశారు. ఆవాలు 1600ఎకరాలు, బోధన్ డివిజన్లో పొగాకు 1250ఎకరాలు, వేరుశనగ 600 ఎకరాలు, పెసర 268 ఎకరాలు, జొన్న 2 వందలు ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వానకాలం సీజన్లో విభిన్న పంటలను సాగు చే సేందుకు రైతులను వ్యవసాయాధికారులు ప్రోత్సహిస్తున్నారు. సాధారణ సాగు విస్తీర్ణాన్ని అధిగమిం చే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉదాహరణకు జిల్లాలో కంది సాధారణ సాగు 3,340 ఎకరాలుంటే దాన్ని 30శాతం పెంచాలని నిర్ణయించారు. పత్తి సాధారణ సాగు 3,128 ఎకరాలు ఉండగా దీన్ని కూడా 30-40శాతం మేర పెంచాలని ప్రయత్నిస్తున్నారు.
గతేడాది 12వేల ఎకరాల్లో పత్తి వేస్తారని ఆశించినప్పటికీ రైతులు కేవలం 4వేలు ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. సోయాబీన్ 80,520 ఎకరాల్లో, మక్కజొన్న 44,851 ఎకరాలు, పప్పు దినుసులు 5వేల ఎకరాల్లో సాగయ్యే సూచనలున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విత్తన లభ్యత ఉంటే సాధారణ సాగు కంటే విస్తీర్ణం పెరగనున్నది. పసుపు 36వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం యథాతథంగా ఉండనున్నది. కూరగాయలు, ఆకుకూరల సాగు ఐదారు వేల ఎకరాల్లోనే పరిమితం కానున్నది.
పంట మార్పిడితో అనేక లాభాలు…
రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలి. తద్వారా అనేక ప్రయోజనాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకే రకమైన పంటను ఏండ్లుగా సాగు చేయడం ద్వారా భూమిలో సత్తువ నశించి పోతుంది. చీడ పురుగుల దాడి పెరిగి పంట నిలబడడం కష్టంగా ఉంటుంది. పంటల మార్పిడి మూలంగా భూమికి బలం చేకూరుతుంది. తద్వారా పంటల దిగుబడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదిస్తే తగు సలహాలు, సూచనలు అందిస్తారు.
– గోవింద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి