ప్రారంభమైన కుస్తీ పోటీల సీజన్
పల్లెల్లో తగ్గని ఆదరణ
గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం
పోటీల్లో స్థానికులతోపాటు, మహారాష్ట్ర పహిల్వాన్లు..
విజేతలకు నగదుతోపాటు, వెండి కడాల బహూకరణ..
గాంధారి, మార్చి 5: ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆధునిక క్రీడలు పుట్టుకొచ్చినప్పటికీ, పల్లెల్లో కుస్తీ పోటీలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తున్న కుస్తీ పోటీలంటే పల్లె ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతోనే ప్రతి సంవత్సరం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో కుస్తీ పోటీలను గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. కుస్తీ పోటీలు జరుగుతున్నాయంటే చాలు పండుగ వాతావరణం నెలకొంటుంది. కుస్తీ పోటీలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక మల్లయోధులతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కుస్తీ పహిల్వాన్లు సైతం వస్తుంటారు. పల్లెల్లో నిర్వహించే కుస్తీ పోటీలు ఒకవైపు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుండగా, మరోవైపు కొందరికి ఉపాధిని కల్పిస్తున్నాయి.
మల్లయోధులకు ఉపాధి..
పల్లెల్లో ఎండాకాలంలో నిర్వహించే కుస్తీ పోటీలు ఒకవైపు ప్రజలకు ఆహ్ల్లాదాన్ని పంచుతుంటే మరోవైపు మల్లయోధులకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే కుస్తీ పోటీలకు స్థానిక మల్లయోధులతో పాటు మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి పహిల్వాన్లు వస్తారు. వీరిలో చాలా మంది పహిల్వాన్లు కనీసం ఐదు, ఆరు పోటీల్లోనైనా గెలుపొందుతారు. మల్లయోధుల్లో చాలా మంది ఒకే రోజు కుస్తీ పోటీల్లో వేల రూపాయల నగదుతోపాటు, వెండి కడాలను సాధించుకుంటారు.
కొబ్బరి కాయ కుస్తీతో మొదలు..
గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించే కుస్తీ పోటీలను డప్పుచప్పుళ్ల నడమ ఘనంగా ప్రారంభిస్తారు. ఈ పోటీలను మొదట చిన్న పిల్లలతో కొబ్బరికాయ కుస్తీని పట్టిస్తారు. మొదటి కుస్తీలో గెలిచిన విజేతకు నిర్వాహకులు కుంకుమ తిలకం పెట్టి కొబ్బరికాయను బహుమతిగా అందజేస్తారు. అనంతరం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500ల కుస్తీలతోపాటు వెండి కడెం పోటీలను నిర్వహిస్తారు. ఈ కుస్తీ పోటీలను వివిధ దశల్లో నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే మల్లయోధులు (పహిల్వాన్లు) తమ సమఉజ్జీలతో ఆయా విభాగాల్లో పోటీపడతారు. గెలిచిన వారికి నిర్వాహకులు, విభాగాల ఆధారంగా నగదు బహుమతులను అందజేస్తారు. కుస్తీ పోటీల్లో ప్రత్యేకమైనది చివరి కుస్తీ. ఇందులో పోటీపడి గెలిచిన వీరుడికి కుంకుమ బొట్టును పెట్టి, వెండి కడియాన్ని బహూకరిస్తారు. దీంతోపాటు పోటీలు రసవత్తరంగా సాగితే కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన మల్లయోధుడికి సైతం నిర్వాహకులు బహుమతులను అందజేస్తారు. విజేతలకు దాదాపు రెండు తులాల వెండి కడెంతో మొదలుకొని 10 తులాల కడెం వరకు బహూకరిస్తారు.
కండబలం.. ఉడుంపట్టు.. నైపుణ్యం కలగలిపిన ఆట కుస్తీ. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు తొడగొట్టి సవాల్ చేస్తుంటారు. యువత కేరింతలు.. మావోడే గెలుస్తాడంటే.. మావోడే గెలుస్తాడంటూ పోటా పోటీ. కండలు తిరిగిన పహిల్వాన్ల క్రీడగా పేరొందిన కుస్తీ పోటీల సీజన్ ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో రెండేండ్లపాటు నిలిచిన ఈ పోటీలు ప్రస్తుతం జోరందుకున్నాయి. ప్రతి వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సంప్రదాయ పండుగల్లో నిర్వహించే ఈ కుస్తీ పోటీలపై ప్రత్యేక కథనం..
పల్లెల్లో జాతర వాతావరణం..
గ్రామాల్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంటే బంధువులతోపాటు, స్నేహితులను ఇండ్లకు ఆహ్వానిస్తుంటారు. కుస్తీ పోటీలు నిర్వహించే ప్రాంతమంతా పెద్ద సంఖ్యలో హాజరైన జనంతో కిక్కిరిసిపోతుంది. దీంతో జాతర వాతావరణం నెలకొంటుంది. ఉమ్మడి జిల్లాల్లోని చిన్నచిన్న పల్లెల్లోనే కాకుండా మండలస్థాయిలో సైతం కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా బాన్సువాడ, గాంధారి, పిట్లం, బిచ్కుంద, లింగంపేట్, నిజాంసాగర్, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, తాడ్వాయి, నస్రుల్లాబాద్, బీర్కూర్, కోటగిరి, బోధన్, వర్ని, నవీపేట తదితర మండలాల్లో ఘనంగా నిర్వహిస్తారు.