హామీలను పట్టించుకోని ఎంపీ ధర్మపురి అర్వింద్
బాండ్‌పేపర్ రాసి రైతులను దగా చేసిన ఎంపీ
పాదయాత్రలో రైతుఐక్యవేదిక నాయకుల ఆగ్రహం
ఆర్మూర్, మార్చి 5: పసుపు బోర్డు ఏర్పాటు చేసేంత వరకు పోరాటం చేస్తామని రైతు ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్‌పేపర్ రాసిచ్చి గెలిచిన తరువాత పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల ఐక్యవేదికల నాయకులు గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపల్లి నుంచి ప్రారంభించిన పాదయాత్ర కమ్మర్పల్లి, మోర్తాడ్, అంక్సాపూర్ మీదుగా శనివారం ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చేరుకున్నది. ఆర్మూర్‌లో పాదయాత్రకు రైతు నాయకులు రంగారావు, రమ, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మామిడిపల్లి చౌరస్తా వద్ద మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. జిల్లాతోపాటు దేశంలో ఏ ప్రాంతంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రైతులకు వంత పాడుతూ వారి ఓట్ల కోసం రైతు పదాన్ని వాడుకుంటున్నారని అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఐక్యంగా పోరాడితేనే పసుపు బోర్డు సాధ్యమన్నారు.
అనంతరం రైతు నాయకుడు రంగారావు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్న రైతుల సమస్యల పరిష్కారం కోసం నాయకులు చొరవ చూపాలన్నారు. బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డును ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో రాసిచ్చిన బాండ్ పేపర్ ప్రకారం ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు క్వింటాలుకు రూ. 12వేలు, ఎర్రజొన్న రూ.4,500 మద్దతు ధర అందేలా చూడాలన్నారు. పాదయాత్రలో ఆర్మూర్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు సారంగి సాందన్న, న్యూడెమోక్రసీ నాయకుడు దేవరాం, రైతు ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తిరుపతిరెడ్డి, మామిడి నారాయణరెడ్డి, గురిజాల రాజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, దేగాం యాదాగౌడ్, మంథని గంగారాం, సుర్బిర్యాల్ జక్క లింగారెడ్డి, మహేందర్‌రెడ్డి, పిప్రి గంగారాం, రామకృష్ణ, సురేశ్, కిషన్, రాజేశ్వర్, దామోదర్, రమేశ్, సుమన్, ఎం.నరేందర్, అనిల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు