భారీ విస్తీర్ణంలో అర్బన్ పార్కు
రూ.20కోట్లతో అభివృద్ధి పనులు
అడవిలో కలియదిరిగిన ఎమ్మెల్యేలు
470 ఎకరాల్లో చిన్నాపూర్‌లో ఏర్పాటు
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు
ముగ్ధులైన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
నిజామాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అటవీ భూముల స్థిరీకరణ, పునరుజ్జీవం, వన్యమృగాల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అడవుల్లో చెట్ల నరికివేతను అరికట్టడంతోపాటు అటవీ విస్తీర్ణాన్ని హరితహారంతో గణనీయంగా పెంచుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పలు విడుతల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగాయి. ఇప్పుడు ఇదే హరితస్ఫూర్తితో ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి తనదైన శైలిలో అటవీ అర్బన్ పార్కు పేరిట వనానికి పునరుజ్జీవం కల్పిస్తున్నారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో 470 ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని అర్బన్ పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. సుమారుగా 6 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్, సముద్రమట్టానికి 40 మీటర్ల ఎత్తుతో 500 మీటర్ల స్థాయిలో వాచ్ టవర్‌ను నిర్మిస్తున్నారు. మూడంతస్థుల వాచ్ టవర్‌పై నుంచి పది కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ నగరాన్ని వీక్షించేలా సౌలభ్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా తూర్పు దిశలో ఆర్మూర్ పట్టణాన్ని స్పష్టంగా చూసే సౌలభ్యం కూడా లభించబోతున్నది.
సందడి… సందడిగా…
రూ.20కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు పనులను పరిశీలించడంతోపాటు ఫారెస్ట్ అర్బన్ పార్కులో విశిష్టతలను వివరించేందుకు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను చిన్నాపూర్కు శనివారం ఆహ్వానించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా స్వయంగా కారు నడుపుకొంటూ చిన్నాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఫారెస్ట్ అధికారి సునీల్‌తో కలిసి నేతలు ప్రత్యేక వాహనంలో అడవంతా కలియదిరిగారు. కాలి బాట కోసం ఏర్పాటు చేసిన 4 కిలోమీటర్ల దారిలో విశాలమైన ప్రాంతాన్ని చూసుకుంటూ ముందుకెళ్లారు. వాచ్ టవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని అటవీ అందాలను వీక్షించారు. ఈ ప్రాంతాన్ని అర్బన్ పార్కుగా డెవలప్ చేయడానికి నిశ్చయించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవను బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అభినందించారు. భవిష్యత్తులో అర్బన్ పార్కు పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
స్వయంగా వాహనం నడుపుతూ…
చిన్నాపూర్ అటవీక్షేత్రానికి ఉదయం 7.40 గంటలకు చేరుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వయంగా బొలెరో వాహనం నడుపుతూ అడవిలో చక్కర్లు కొట్టారు. వెంట కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను కూర్చోబెట్టుకుని అర్బన్ పార్కులో జరుగుతున్న పనుల వివరాలపై ఆరా తీశారు. సహజ సిద్ధమైన వర్షపు నీటితో జలాశయాన్ని రూపొందించబోతున్న ప్రదేశాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తిలకించారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా అక్కడికి చేరుకొని అడవిలో జలాశయం వద్దకు వెళ్లారు. బాజిరెడ్డి జీప్ వాహనాన్ని బిగాల స్వయంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆనకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత పనుల తీరుతెన్నులను బాజిరెడ్డి, బిగాలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివరించారు. కలెక్టర్, డీఎఫ్‌వోకు ఎమ్మెల్యేలు పలు సలహాలు, సూచనలు అందించారు. జలాశయం నిర్మాణ ప్రాంతం నుంచి తిరుగు ప్రయాణంలో బాజిరెడ్డి, బిగాలను కూర్చోబెట్టుకుని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారు నడిపారు. ఎత్తయిన స్థలంలో నిర్మిస్తున్న వాచ్‌టవర్ వద్ద అడవిని పరిశీలించారు. సుమారు మూడున్నర గంటల పాటు నేతలంతా చిన్నాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్కులో హుషారుగా కనిపించారు. స్వాగత తోరణం, పార్క్ చుట్టూ కంచె, ప్రహరీ, ప్రజల సౌకర్యర్థం కల్పించబోతున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.