నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 28: జిల్లాలో గంజాయి సాగుచేస్తున్న వారితో పాటు క్రయ, విక్రయదారులపై పోలీసులు దాడులను ముమ్మరం చేశారు. అటవీశాఖ ఇచ్చిన భూమి లో గంజాయి సాగుచేస్తున్న నిందితుడిని పక్కా సమాచారంతో పోలీస్ టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నాయి. అతడితోపాటు గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కిలోల 600 గ్రాము ల ఎండు గంజాయితో పాటు విత్తనాలు, మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ నాగరాజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ చంద్రతో కలిసి సోమవారం కమిషనరేట్‌లో వెల్లడించారు. మోపాల్ మండల పరిధిలోని అమ్రాబాద్ గ్రామంలో గంజాయి ఉన్న సాగుచేస్తున్నారనే సమాచారం మేరకు అదనపు డీసీపీ అరవింద్ బాబు నేతృతంలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్, టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశం, మోపాల్ ఎస్సై జి.మహేశ్, ఏఎస్సై రమేశ్, టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై రామకృష్ఱ, హెడ్ కానిస్టేబుల్ చందూలాల్,కానిస్టేబుళ్లు సుధాకర్, రాంచందర్, సలీం, నర్సయ్య, సంతోష్ కుమార్, హోంగార్డులు షేక్ ఇలియాస్ అహ్మద్, గంగాధర్ దాడులు నిర్వహించారు. మోపాల్ మండల పరిధిలోని అమ్రాబాద్ గ్రా మంలో కేతావత్ సవాయిరాం అటవీశాఖ ఇచ్చిన భూ మిలో పొద్దు తిరుగుడు పువ్వు పంటలో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. సవాయిరాం పండించిన గంజాయిని అదే గ్రామానికి చెందిన మాలోత్ బలరాం సరఫరా చేసేవాడు. పక్కాసమాచారంతో అధికారులు దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. దీంతోపాటు 400 గ్రాముల గంజాయి మొక్కలు, 600 గ్రాముల గంజాయి విత్తనాలు,1800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేతావత్ సవాయిరాం, మాలోత్ బలరాంలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బైక్‌తోపాటు నాలుగు సెల్ఫోన్లు సీజ్ చేశారు. గంజాయి విలువ రూ.56 వేలు ఉంటుందని సీపీ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించిన సీపీ వారికి రివార్డులను అందజేశారు.
భీమ్‌గల్ ఏరియాలో ఇద్దరు అరెస్టు..
భీమ్‌గల్ మండల పరిధిలోని దొన్కల్ గ్రామంలో గంజాయి నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో దాడులు చేశారు. దాడిలో గ్రామానికి చెందిన అంగోత్ పంతులు, నెనావత్ విఠల్ వద్ద నుంచి 1,870 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నరేశ్, ఎస్సై మహేశ్, టాస్క్‌ఫోర్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.