కామారెడ్డి, మే 17 : ఆరుగాలం శ్రమంచి పంటలు పండించిన అన్నదాతలను వర్షాలు అతలాకుతలం చే యగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను చేపట్టి రైతులకు అండగా నిలబడింది. పంట కొనుగోళ్లు సజావుగా సాగుతున్న క్రమంలో అకాల వర్షాలతో ధాన్యం రాసులను తడిసిపోయాయి. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లాలో 344 కొ నుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 340 కేంద్రాల్లో 95 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు కామారెడ్డి జిల్లా పై తీవ్ర ప్రభావం చూపాయి. వర్షం కారణంగా 22 మండలాల పరిధిలోని 221 కొనుగోలు కేంద్రాల్లో 66,910 బస్తాల్లో ఉన్న 26,737 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ దోమకొండ, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట మండలాల్లో పర్యటించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన పంటను కొనుగోలు చేయడంతో పాటు వర్షానికి తడిసిన ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని శుభ్రపరిచి కాంటాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి
రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తున్నది. ప్రతి ఏటా ధాన్యం కొనుగోలుకు కేసీఆర్ సర్కారు ముందుకు వస్తున్నది. కేంద్రం మాత్రం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అకాల వర్షాలకు తడిచిపోయిన ధాన్యాన్ని సేకరిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పడం సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
– అశోక్ రెడ్డి, రాజంపేట
తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం సంతోషం
అకాలవర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉంది. అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ అండగా నిలుస్తున్నది. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేస్తున్నది. అకాల వర్షం అన్నదాతలను కలవరానికి గురి చేసినా ప్రభుత్వం మాత్రం రైతుకు మద్దతుగా నిలుస్తున్నది.
– రాజు, చిన్నమల్లారెడ్డి