రుద్రూరు (కోటగిరి), ఏప్రిల్ 25: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ముస్లిములకు ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. రంజాన్ వేడుకల్లో కేవలం ముస్లిములు మాత్రమే కాకుండా హిందువులు కలిసి పాల్గొంటారని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని స్పీకర్ పరిశీలించారు. మండల కేంద్రంలో బాలికల వసతి గృహ నిర్మాణానికి స్థలం పరిశీలించాలని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ శంకర్ పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సర్కారు సమప్రాధాన్యం:ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిములకు టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్‌తో కలిసి సోమవారం రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి వెల్లివిరియాలని కోరారు. కామారెడ్డి నియోజకవర్గానికి 2,500 రంజాన్ కానుకలు రాగా, అందులో కామారెడ్డి మున్సిపల్‌కు వెయ్యి కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు మీర్జా హఫీజ్ బేగ్, నజీరుద్దీన్, అంజద్, సలీం, లడ్డూ, ఆసిఫ్, మైనార్టీ పట్టణ అధ్యక్షుడు షౌకత్, జమీరుద్దీన్, నాయకులు పిప్పిరి వెంకన్న, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.