కామారెడ్డి, మార్చి 20: మన ఊరు – మనబడిలో భాగంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు, దశల వారీగా అన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించనున్నది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లతో ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పనున్నారు. మొదటి విడుతలో ఎస్జీటీ స్థాయిలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు.
17 కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ
ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యం పెంపొందించేందుకు ఇటీవల రాష్ట్రస్థాయిలో ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 14 నుంచి ఆన్లైన్ వేదికగా బెంగుళూరు అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ(ఎస్సీఈఆర్టీ) సంయుక్తంగా నిర్వహించిన శిక్షణలో కామారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు కీ రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన కీ రీసోర్స్ పర్సన్లు సదాశివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 60 ఉపాధ్యాయులకు వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వీరంతా కలిసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు తొమ్మిది విడుతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా నాలుగు విడుతల్లో నిర్వహించనుండగా అందులో ఒకటి ఆన్లైన్ విధానం, మిగతా మూడు ఆఫ్‌లైన్ విధానంలో శిక్షణ ఇస్తారు.
నేటి నుంచి మొదటి విడుత షురూ..
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 17 కేంద్రాల్లో 2085మంది ఎస్జీటీలకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభం కానున్నది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ మార్చి 21 నుంచి 25 వరకు 817 మందికి, రెండో దశ మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 811 మందికి, మూడో దశ ఏప్రిల్ 4 నుంచి 11వ తేదీ వరకు 457 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందనున్నారు. ఈ కార్యక్రమానికి భిక్కనూర్‌లో రెండు, కామారెడ్డిలో రెండు, సదాశివనగర్‌లో ఒకటి, తాడ్వాయిలో రెండు, గాంధారిలో ఒకటి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం మండలాల్లో రెండు చొప్పున, బిచ్కుందలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో విడుతలో సుమారు 45-50 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందనున్నారు.
4091 మంది ఉపాధ్యాయులకు శిక్షణ…
కామారెడ్డి జిల్లాలో 1,011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో జడ్పీ హైస్కూళ్లు 187, ప్రాథమికోన్నత పాఠశాలలు 127, ప్రాథమిక పాఠశాలలు 697 ఉన్నాయి. వీటిలో 94,698 మంది పిల్లలు చదువుతున్నారు. జిల్లాలో 4,946 ఉపాధ్యాయ పోస్టులకు ప్రస్తుతం 4,089మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం 3,152 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనా నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమాన్ని దశలవారీగా ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 60 మంది ఉపాధ్యాయులు మెంటార్‌గా వ్యవహరిస్తూ ఇతర ఉపాధ్యాయులకు మెళకువలు నేర్పుతారు. మొదటి మూడు దశల్లో 2085 మంది ఎస్జీటీలకు ఆతర్వాత 1067 మంది హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు శిక్షణ పొందుతారు.
నైపుణ్యాల సాధనే లక్ష్యంగా..
ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది తెలుగు మీడియం నుంచి వచ్చినవారే కావడంతో ఇంగ్లిష్ మీడియం అమలుకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం నుంచి ప్రాథమిక పాఠశాలలోని ఎస్జీటీలకు, భాషా పండితులు మెళకువలను నేర్పనున్నారు. ఆ తర్వాత వివిధ సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం మూడువారాల పాటు ఆన్లైన్ శిక్షణ ఉంటుంది.
కలెక్టర్‌కు రూ.2కోట్లు నిధులు..
ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం 12 అంశాలను అభివృద్ధి చేయనున్నారు. టాయిలెట్ల నిర్మాణం దగ్గరి నుంచి డిజిటల్ తరగతుల వరకు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి రూ.7289 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. నిజామాబాద్ జిల్లాకు ఇందులో రూ.170 కోట్ల వరకు మంజూరయ్యే ఆస్కారం ఉన్నది. వీటికి అదనంగా జిల్లా కలెక్టర్‌కు రూ.2కోట్లు మంజూరు చేసింది. కలెక్టర్ విచక్షణాధికారంతో ప్రభుత్వ బడుల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ నిధులను వెచ్చించబోతున్నారు. అత్యవసర ఖర్చు కింద ఈ మొత్తాన్ని బడుల బాగు కోసం వెచ్చిస్తారు.
నిజామాబాద్ జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరానికి సుమా రు 20వేల మంది విద్యార్థులు నేరుగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తీసుకున్నారు. 1-10 తరగతుల్లో మొత్తం 20,047 మంది అడ్మిషన్లు తీసుకున్నట్లుగా విద్యాశాఖ పేర్కొన్నది. వీరిలో ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చిన వారే 5,881 మంది ఉన్నారు. రెండేండ్లుగా ప్రత్యక్ష తరగతులు నడవకపోవడం ఒక కారణమైతే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులకు కూడా మొత్తం ఫీజులను ముక్కు పిండి వసూలు చేయడం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. నర్సరీ, ప్రైమరీ స్కూళ్లలో ఎలాంటి బోధన జరగకపోయినా ఫీజులు మాత్రం వసూలు చేశాయి. పైతరగతులకు విద్యార్థులను ప్రమోట్ చేయాలంటే ఫీజుల చెల్లించాల్సిందేనంటూ ఎడాపెడా వసూలు చేయడంతో ప్రజల్లో ఇబ్బంది ఏర్పడింది. ఫీజుల భారం తాళలేక ప్రభుత్వ బడులను ఆశ్రయించారు.