కామారెడ్డి/నిజాంసాగర్/బాన్సువాడ రూరల్, మార్చి 16:ఉపాధి హామీ, సెర్ప్, మెప్మా ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
మరోవైపు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటనతో అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. రెండేండ్లుగా ఉపాధి పనులకు దూరమై, వేతనాలు రాక, ఇతర పనులకు వెళ్లలేక కుటుంబాలను పోషించుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డామని, సీఎం ప్రకటనతో తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని ఉమ్మడి జిల్లాలో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి స్వీట్లు పంచుకున్నారు. సీఎం ప్రకటనతో కామారెడ్డి జిల్లాలో 323 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల్లో వెలుగులు రానున్నాయి.
ఊపిరి పీల్చుకున్న పంచాయతీ కార్యదర్శులు
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. చాలాచోట్ల పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి పనులు భారంగా మారాయి. ప్రభుత్వ నిర్ణయంతో పనిభారం తప్పనున్నదని పంచాయతీ కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఇటు పంచాయతీ కార్యదర్శులు అటు ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోనే ఉద్యోగులకు గుర్తింపు..
రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని పలుమార్లు ప్రస్తావించే సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మంగళవారం తీపి కబురు చెప్పా రు. తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటన చేయడంతో వారు హర్షంవ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 323 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా మొత్తం జీపీల సంఖ్య 526కు చేరింది. దీంతో కొత్త జీపీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాల్సి ఉన్నది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న సెర్ప్, మెప్మా సిబ్బందికి వేతనాలను పెంచారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్న గౌరవవేతనాన్ని సైతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో 176 మంది సెర్ప్, ఏడుగురు మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు అందనున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తాం
గ్రామీణ ప్రాంతంలో పేద కుటుంబాలకు పని కల్పించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తాం. మరోసారి సమ్మెకు దిగొద్దని తెలిపిన సీఎం కేసీఆర్ మాటను గౌరవిస్తాం. సీఎం నిర్ణయంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వ సహకారంతో ముందుకు సాగుతాం.
– హనీఫ్, ఫిల్డ్ అసిస్టెంట్, కోనాపూర్
ఆనందంగా ఉన్నది..
రెండు సంవత్సరాలుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకొని తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– బాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మండల అధ్యక్షుడు, నిజాంసాగర్
సీఎం కేసీఆర్ నిర్ణయం సంతోషాన్నిచ్చింది
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనతో మా కుటుంబాలకు చాలా సంతోషం కలిగింది. మా కష్టాలను అర్థం చేసుకొని విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. సీఎం కేసీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు రుణపడి ఉంటాయి. రెండేండ్లుగా ఉద్యోగాలు లేక ఇతర ప్రైవేటు పనులకు వెళ్లి ఇబ్బందులుపడ్డాం. తిరిగి విధుల్లో చేరుతుండడంపై సంతోషంగా ఉంది.
– నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి