బీర్కూర్/బాన్సువాడ టౌన్, మార్చి 6: తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని శాసనసభ స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఇందులోభాగంగా మొదటి రోజు పారిశుద్ధ్య కార్మికులు, దవాఖాన సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, మహిళా క్రీడాకారులను స్పీకర్ ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటంతోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం బాన్సువాడ మున్సిపల్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల8వ తేదీన బహుమతులు అందజేస్తామని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తెలిపారు.
మన పథకాలు చూసి పొరుగురాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కల్యాణమండపంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులతో కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం పొతంగల్ గ్రామంలో గత శుక్రవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో తాను మాట్లాడుతుండగా మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మైకు తీసుకొని ‘హమ్కో దేశ్‌కీ నేత కేసీఆర్ చాహియే..’ అన్నప్పుడు తాను ఎంతో గర్వంగా ఫీలయ్యానని చెప్పారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న ఇలాంటి సీఎం దేశంలోనే లేడన్నారు. మహిళా సాధికార త కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
మహిళలను గౌరవించాలి
ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకేనని, ఎంత గొప్పవారైనా, ఎంతపెద్ద హోదాలో ఉన్నా మహిళలను గౌరవించాలని అన్నారు. సమాజంలో మహిళలను తమ తల్లి, సోదరిలా భావించి గౌరవించాలని సూచించారు. ఎక్కడైతే మహిళలు కంటనీరు రాకుండా సంతోషంగా ఉంటారో అక్కడ శుభం చేకూరుతుందన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, అయినప్పటికీ మహిళల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోని మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లను అందిస్తున్నది కేవలం దేశంలో తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. గతంలో పేదింటి ఆడపడుచు పెండ్లి తల్లిదండ్రులకు భారంగా ఉండేదని, కానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆ కష్టాలు తీరాయన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పది లక్షల మంది ఆడపడుచులకు సాయం అందించినట్లు తెలిపారు.
గురుకుల విద్యాలయాల ద్వారా విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణగుప్తా, బుడిమి విండో చైర్మన్ పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఎజాస్, కో-ఆప్షన్ సభ్యుడు బాబా, మండల నాయకులు గోపాల్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు నేహ సుల్తానా హకీమ్, రమాదేవి, నసీమా ఫిర్దోస్ ఆమెర్, సరితా నర్సుగొండ, లింగమేశ్వర్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, నాయకులు కిరణ్‌కుమార్, రఫీక్, మహిళా సం ఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.