పార్టీలు, కులమతాలకతీతంగా పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
వర్నిలో అభివృద్ధి పనుల పరిశీలన
వర్ని, ఆగస్టు 27 : బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై పలువురు నాయకులు రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హితవు పలికారు. వర్ని మండల కేంద్రంలోని రైతు వేదిక, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, ఫంక్షన్ హాల్ తదితర అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు శిక్షణ పొందుతున్న క్రీడాకారులను ఆయన పలకరించి వారి ఆట తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పలువురు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శల్లో అర్థం లేదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 5వేల ఇండ్లు మంజూరు చేశామని, మరో ఐదు వేల ఇండ్లు నిర్మిస్తామన్నారు. కులమతాలు, పార్టీలకతీతంగా నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యమన్నారు. ఆయిల్ పాం పెంపకం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చన్నారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన ధాన్యం కన్నా 10రెట్లు అధికంగా ధాన్యం పండిస్తున్నారన్నారు.మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వర్ని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి గాను రూ.90 లక్షలు, ఎస్సీ బాలుర వసతి గృహానికి రూ.కోటి, బాలుర ఉన్నత పాఠశాలకు రూ.10లక్షలు, రైతు వేదికకు మరో రూ.2లక్షలు, మైనారిటీ కమ్యూనిటీ భవనానికి రూ.2 లక్షలు, మండల కేంద్రంలోని షాదీఖానకు మరో రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, వర్ని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు, జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో ఆప్షన్ సభ్యుడు కరీం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గంగారాం, ఉప సర్పంచ్ కంది కృష్ణ, సహకార సంఘం అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, వెలగపూడి గోపాల్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో బషీరుద్దీన్, మండల వ్యవసాయ అధికారి నగేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.