కామారెడ్డి టౌన్, జూన్ 28: సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శానస సభా వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సన్నాహక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూలై ఒకటి నుంచి పదో తేదీ వరకు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించి జిల్లాను నంబర్‌వన్ స్థానంలో నిలుపుదామని మంత్రి సూచించారు. మూడు విడుతల్లో చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం చేపట్టే నాలుగో విడుత కార్యక్రమాల్లో భాగంగా ప్రజా ప్రతినిధుల సహకారంతో వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
కూలిన, శిథిలమైన ఇండ్లను తొలగించాలని, కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ముందుండేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో 2014లో రూ.160కోట్లు ఉన్న ఈజీఎస్ నిధులు ప్రస్తుతం 2021 సంవత్సరంలో రూ.434 కోట్లకు చేరిందన్నారు. జిల్లాలో చేపట్టిన ఈజీఎస్ పనులను కేంద్ర బృందం తనిఖీ చేసి అభినందించిందని మంత్రి తెలిపారు. విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎం భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన అభివృద్ధి మన కండ్లకు కనబడుతున్నదని, అందరం కలిసి సీఎం ఆలోచనలను, కలలను నెరవేరుద్దామని అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్, జిల్లా పోలీసు భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను అధికారులందరూ ఒక బృందంగా పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. నేడు (మంగళవారం) మండల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, గ్రామస్థాయి వరకు శిక్షణ అందించాలని తెలిపారు. ఈనెలాఖరులోపు ఫారెస్ట్ రీ జనరేషన్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. పది రోజుల్లోపు పరమపద వాహనం ఏర్పాటు చేయాలని కామారెడ్డి కమిషనర్‌ను ఆదేశించారు. జుక్కల్ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల రాకుండా పల్లె ప్రగతి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో గత 75 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఐదేండ్లలో కనిపిస్తున్నదని తెలిపారు. అనంతరం ప్రగతి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్ దోత్రే, వెంకటమాధవరావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో సునంద, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, ఆర్డీవోలు శ్రీను, రాజాగౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.