జక్రాన్‌పల్లి, ఆగస్టు 22: వాణిజ్య పంటల్లో బంతి,చేమంతి సాగు ముఖ్యమైనవి. అనేక సందర్భాల్లో అలంకరణకు పూలను వాడుతారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో బంతి పూలను విరివిగా వాడుతారు. మల్లె తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువగా పండించేది బంతి. ఏడాది పొడవునా, తక్కువ కాల వ్యవధిలో సాగవుతుందని ఏవో దేవిక వివరించారు.
రకాలు :
ఆఫ్రికన్ బంతి : మొక్కలు బలంగా, ఎత్తుగా(90 సెం.మీ) పెరిగి గుండ్రటి ఆకారాన్ని కలిగిన పూలు పూస్తాయి. లేత పసుపు పచ్చ, ముదురు పసుపు పచ్చరంగులో పూలు పూస్తాయి.
ఫ్రెంచ్ బంతి : మొక్కలు బలంగా, ఎత్తుగా (2.530 నుంచి 1016 సెం.మీ) పెరిగి గుండ్రటి ఆకారము కలిగి, లేత పసుపు రంగు పూలు పూస్తాయి.
వాతావరణం.. నేలలు
బంతిని ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎక్కువ వర్షపాతం, వడగాలులు, నీటి ఎద్ద డి ఉన్నచోట దిగుబడి తగ్గుతుంది. తేలికపాటి నుంచి కొద్దిగా బరువైన నేలలోనూ బంతిని పండించవచ్చు. బరువైన నేలలో పండించేటప్పుడు మురుగు నీరు పొలం నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.
విత్తనం.. నారు పెంచుట
హెక్టారుకు 500 నుంచి 800 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఒక మీటరు వెడల్పు, తగినంత పొడవు కలిగిన మడుల్లో విత్తనాలను పలుచగా చల్లుకోవాలి. లేదా 10 సెం.మీ దూరంలో వరుసగా విత్తుకోవాలి. విత్తే ముందు ప్రతి చదరపు మీటరు నారుమడిలో 10 కిలోల బాగా మాగిన పశువుల ఎరువు వేయాలి. బంతి నారును జూన్ నుంచి సెప్టెంబర్ లేదా జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో నారు పోసుకోవచ్చు.
మొక్కలు నాటుట..
మొక్కలు నాటే ముందు భూమిని దున్ని చదునుగా తయారు చేయాలి. హెక్టారుకు 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు, 60 కేజీల నత్రజని, 40 కేజీల భాస్వరము, 60 కేజీల పొటాష్‌ను ఇచ్చే ఎరువులను వేసి కలియదున్నాలి. మొక్కలు నాటిన 20రోజుల్లో మళ్లీ మొత్తం మోతాదును రెండు దఫాలుగా విభజించి వేసుకోవాలి.
మొగ్గ తుంచుట
నాటిన 30 రోజులకు కొనలను తుంచేయాలి. దీంతో కొమ్మలు ఎక్కువగా వచ్చి అధికంగా పూలు పూస్తాయి.
కలుపు నివారణ
మొక్కలు నాటిన 30రోజుల్లో రెండుసార్లు కలుపుతీయాలి. నీటిని మొదట రెండు, మూడు రోజులకోసారి, తర్వాత వారానికోసారి అందించాలి.
తెగుళ్ల నివారణ
ఆకులను తినే గొంగళి పురుగు నివారణకు థయోడాన్ 1మి.లీ. మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకు రసాన్ని పీల్చే పురుగు నివారణకు మోటాసిస్టాక్స్ను 2 మి.లీ. మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గల నుంచి రసాన్ని పీల్చే ఎర్రనల్లి నివారణకు కెల్తేన్ అనే మందును 1.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పంటకోత
మొక్కలు నాటిన 60 నుంచి 70 రోజులకు కోత ప్రారంభమవుతుంది. హెక్టారుకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.