ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక. కానీ ఒక్క ఫొటో కోటి భావాలకు ప్రతీక. గతించిన కాలానికి ఛాయాచిత్రం ఒక జ్ఞాపిక. ఆత్మీయులతో గడిపిన క్షణాలను, గుండె బరువెక్కిన సందర్భాలనూ కండ్ల ముందే కరిగించేస్తుంది. అలా కరిగిపోయే ముందు ఒక్క కెమెరాకు మాత్రమే దొరికిపోతుంది. కాలం చెక్కిలిపై చెదరని సంతకమై నిలిచిపోతుంది. వేలాది అక్షరాల్లో సైతం వర్ణించలేని భావాన్ని ఒక్క ఫొటో చెప్పగలదు. నేడు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
కొత్తపుంతలు తొక్కుతున్న ఫొటోగ్రఫీ
సాంకేతికతతో నిత్యయవ్వనం ఫొటోగ్రఫీ సొంతం
చీకటి గది నుంచి శాఖోపశాఖలుగా ఎదిగి..
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ఖలీల్‌వాడి/ కమ్మర్పల్లి, ఆగస్టు 18: ఫొటో.. మధుర జ్ఞాపకాలను తరతరాలు భద్రపరుస్తుంది. పండుగలు, పబ్బాలు, వివాహాలు, వేడుకలు, విహారాలు, విషాదాలు, సాహసాలు..అన్నింటికీ ఫొటో సాక్ష్యంగా నిలుస్తుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫొటోలు మాత్రమే. రోడ్డు మీద వెళ్తున్నాం.. పక్కనే ఓ అందమైన పక్షి కనబడింది. వెంటనే.. దానిని మనస్మార్ట్ ఫోన్లో బంధించేస్తాం. దానిని అందరికీ పంపించి సంబురపడిపోతాం. మార్పులు ఎన్ని వచ్చినా జీవితంలో ఫొటోది విడదీయలేని బంధమే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫొటోగ్రఫీ మరీ తేలిక అయ్యింది. ఇక సెల్ఫీ ఫొటోగ్రఫీ కొత్తపుంతలు తొక్కుతున్నది. నేడు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఫొటోగ్రఫీ విస్తరణ
ఫొటోగ్రఫీ ఇంతింతై వటుడింతై అన్న చందగా ఎదిగింది. ఇందు గలదు అందు లేదు అన్నట్లు ఎన్నో రంగాలతో మమేకమైపోయింది. చాలా కాలం పాటు ఫొటోకు రూపం తేవడం స్టూడియోల్లో చీకటి గదిలోనే జరిగేది. ఫిలిం డెవెలప్మెంట్ ప్రక్రియగా సాగింది. ఈ ప్రక్రియ రెండు దశలుగా ఉండేది. మెటల్ హైడ్రోక్వినన్, సోడియం కార్బోనేట్, సోడియం సల్ఫేట్, పొటాషియం, ట్రోమైట్తో ఫిలిం డెవలప్ చేసేవారు. రెండోదశలో మెటల్ సల్ఫేట్‌తో ప్రింట్ తీసే వారు. కంప్యూటర్లు, అధునాతన కెమెరాల రాకతో ఫొటోగ్రఫీ చీకటి గదుల నుంచి వెలుగుల్లోకి వచ్చేసింది.
ఫొటోగ్రఫీలో ఎన్నో రకాలు
ఫొటోగ్రఫీలో ఎన్నో కళాత్మక కోణాలు ఉన్నా యి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఫొటో సెషన్ నిర్వహించి బహుమతులు, అవార్డులను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యక్తుల జీవన శైలి, వైల్డ్‌లైఫ్, ఫోర్ట్రైట్స్, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ, శాటిలైట్ ఫొటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ, వె డ్డింగ్ ఫొటోగ్రఫీ ఇలా ఎన్నో కళాత్మక కోణాల్లో ఫొ టోలు తీయడానికి అవకాశం ఉంది.
అరచేతిలో అధునాతనం..
దశాబ్దాలు గడిచేకొద్దీ రకరకాల కెమెరాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలా నేడు అరచేతిలో ఇమిడిపోయి, కనురెప్ప పాటులో క్లిక్ అనిపించే ఫొటోగ్రఫీ వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమదాగి ఉంది. ప్రస్తుతం ఫొటోగ్రఫీ చేయితిరిగిన ఫొటోగ్రాఫర్లకే పరిమితం కావడంలేదు. అందర్నీ సామాజిక కోణంలో ఆలోచింపజేసే ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దుతోంది. తమ ఫొటోలు తామే తీసుకునే సెల్ఫీల ట్రెండ్ ప్రస్తుతం నడుస్తున్నది. సెల్ఫీ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి.
ఫొటోగ్రఫీ ఒక కళ..
ఫొటో తీయడం ఒక కళ. దాని వెనుక ఎన్నో వర్ణాలు ఉంటాయి. ఫొటో ఒక్కటైనా అర్థాలు ఎన్నో రాసుకోవచ్చు. ఫొటోలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తాయి. గతాన్ని మనం మరిచిపోయినా అప్పటి ఫొటో కనబడగానే గతం గుర్తొస్తుంది. అలాంటి మధురమైన జ్ఞాపకాలను పంచేదే ఫొటో.
నాకు నచ్చిన వృత్తి..
డిజైనింగ్, ఫొటోగ్రఫీ నేర్చుకున్నా. ఎక్కడికైనా వెళ్లి ఫొటోలు తీయడం నాకు ఇష్టం. డిజైనింగ్ చేయ డం చాలా ఇష్టం. ఫొటోలను అనేక రకాలుగా తీసేందుకు ఎక్కువగా ఇష్టపడుతా.
ఫొటో అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఫొటో దిగడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ ఎక్కువగా పెరిగింది. సెల్ఫీలు, వెడ్డింగ్ ఫొటోషూట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రోజుల్లో యువత మొబైల్ ద్వారా సెల్ఫీ దిగడంతోపాటు అందులోనే ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా కెమెరాలను అద్దెకు తీసుకొని ఫొటోషూట్ చేస్తున్నారు. డ్రోన్‌కెమెరా సహాయంతో కూడా ఫొటోలను తీస్తూ అందమైన ప్రదేశాలను అందరికీ పరిచయం చేస్తున్నారు.