కమ్మర్‌పల్లిలో సిద్ధమవుతున్న మినీ స్టేడియం
2.50 కోట్లతో పనులు
క్రీడామైదానం కోసం కమ్మర్పల్లి మండల యువకులు కన్న కల నెరవేరబోతున్నది. సమైక్య పాలనలో మినీస్టేడియం ఏర్పాటు చేయాలని దశాబ్దాల పాటు చేయని ఆందోళనలు, ధర్నాలు లేవు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో స్టేడియం నిర్మిస్తానని యువతకు హామీ ఇచ్చిన మంత్రి వేముల..అన్నట్లుగానే నిధులను మంజూరు చేయించారు. స్టేడియంలో పనులు చురుకుగా కొనసాగుతూ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.
కమ్మర్పల్లి, ఆగస్టు 18: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. మండల యువత, క్రీడాకారులు దశాబ్దాలుగా మినీ స్టేడియం కోసం కన్న కలలు సాకారం కాబోతున్నాయి. సుమారు ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడి యువకులు తమకు సౌకర్యవంవతమైన ఆటస్థలం కావాలని, మినీ స్టేడియం నిర్మించాలని కోరుతూ వచ్చారు. ప్రజాప్రతినిధులకు, నాయకులకు విన్నవిస్తూ వచ్చారు. ఒక దశలో ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ వారి కల సాకారం చేయలేకపోయారు గత పాలకులు. ఉద్యమ సమయంలో ఈ ఆంశాన్ని గుర్తించి యువతకు హామీ ఇచ్చిన.. వేముల ప్రశాంత్‌రెడ్డి తాను ఎమ్మెల్యేగా గెలిచాక మినీ స్టేడియాన్ని మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ మినీ స్టేడియం పనులు పూర్తి కావొస్తున్నాయి.
రూ.2.50కోట్లు మంజూరు
మండల కేంద్రం కమ్మర్పల్లితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆసక్తి గల క్రీడాకారులు, పోలీసు, ఆర్మీ, వ్యాయామోపాధ్యాయ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన యువకులకు కొదువ లేదు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్‌తోపాటు పలు క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆడిన వారూ ఉన్నారు. షటిల్, క్యారం, తదితర ఇండోర్ ఆటల్లో ఆసక్తి, ప్రతిభ కలిగిన వారు ఉన్నారు. కమ్మర్‌పల్లిలోని జడ్పీ హైస్కూల్ పాఠశాల గ్రౌండ్ తరగతి గదుల నిర్మాణంతో ఆటలకు సరిపోవడం లేదు. దీంతో మినీ స్టేడియం కావాలని కోరుతూ వచ్చారు. యువతకు, క్రీడాకారులకు ప్రయోజనం కలుగుతుందని భావించి గ్రామాభివృద్ధి కమిటీ ఆరు ఎకరాల స్థలాన్ని సమకూర్చింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేసి రూ.2.50 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో స్టేడియం భవనాల నిర్మాణం పూర్తయ్యింది. పెవీలియన్ బిల్డింగ్, ఇండోర్ గేమ్స్ బిల్డింగ్, హాళ్ల నిర్మాణాలు, గదులు, స్నానాల గదులు, డ్రెస్సింగ్ రూముల నిర్మాణాలు పూర్తయ్యాయి. మంత్రి వేముల సైతం నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరగా పూర్తయ్యేలా చొరవ చూపుతున్నారు.
యువత హర్షం
ఇండోర్ షటిల్ కోసం వుడెన్ కోర్డును పరిచారు. పలు ఇండోర్ గేమ్స్, వ్యాయామ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రౌండ్ చదును పనులు తుది దశకు చేరాయి. వాకర్స్ కోసం ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ గ్రామాల యువకులు, క్రీడాకారులు వచ్చి పూర్తయిన భవనాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.