‘ఇంటింటా ఇన్నోవేటర్’కు ఎంపికైన ఇసాయిపేట విద్యార్థిని ఆలోచన
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రదర్శన
సర్టిఫికెట్ అందుకోనున్న స్పందన
రూ.70తో డిష్ వాషర్ ఆవిష్కరణ
ఆలోచనలకు పదును పెడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిందీ చిన్నారి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని స్పందన రూ.70తో రూపొందించిన డిష్ వాషర్ ఇంటింటా ఇన్నోవేటర్‌కు ఎంపికయ్యింది. జిల్లా నుంచి 13మంది దరఖాస్తు చేసుకోగా.. చిన్నారి ఆవిష్కరణను టీఎస్ఐపాస్ ఎంపిక చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు నిర్వహించే వేడుకల్లో ఆన్లైన్ వేదికగా స్పందన డిష్ వాషర్‌ను ప్రదర్శించనున్నది.
మాచారెడ్డి, ఆగస్టు 14:
ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజన దాగి ఉంటుంది. ఆయా వర్గాల ప్రజల కొత్త ఆలోచనల ద్వారా ప్రాజెక్టుల రూపకల్పన,సృజనాత్మకతలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే జిల్లాలోని వివిధ వర్గాల నుంచి ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిలోని ఆలోచనలను వెలికితీసి స్థానిక సమస్యలకు వారితో పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహించారు.
కామారెడ్డి నుంచి ఒకరు ఎంపిక
కామారెడ్డి జిల్లా నుంచి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు రాగా అధికారులు వాటిని టీఎస్ఐపాస్కు పంపించారు. అందులో వినూత్నంగా రూపొందించిన డిష్ వాషర్ ఎంపికయ్యింది. దీనిని మాచారెడ్డి మండలం ఇసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న భీంసారి స్పందన తయారు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని నేడు (ఆదివారం) నిర్వహించే వేడుకల్లో డిష్‌వాషర్‌ను ప్రదర్శించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏకకాలంలో ఆన్లైన్లో ప్రదర్శన నిర్వహిస్తారని, అనంతరం ప్రభుత్వం తరఫున ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
తక్కువ ఖర్చుతో డిష్ వాషర్
గిన్నెలు శుభ్రం చేసేందుకు తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్‌తో డిష్వాషర్ రబ్బర్‌ను స్పందన ఆవిష్కరించింది. కేవలం రూ.70 ఖర్చుతో ఈ పరికరాన్ని తయారు చేసింది. డిష్ వాషర్ ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళలకు ఉపయోగపడుతుంది. గతంలో పాఠశాలలో లేబర్ హెల్పింగ్ డివైస్‌ను రూపొందించింది స్పందన. దీని ద్వారా మేస్త్రీలు ఇటుక, ఇసుక, కంకరను సులువుగా పనిచేసే స్థలాలకు తీసుకెళ్లవచ్చు.
మరిన్ని ఆవిష్కరణలు చేస్తా..
నేను తొలిసారిగా లేబర్ హెల్పింగ్ డివైస్‌ను మా గణితం టీచర్ స్వర్ణలత ప్రోత్సాహంతో రూపొందించాను. నేను తయారు చేసిన డిష్ వాషర్ జిల్లా స్థాయిలో ఎంపికవ్వడం సంతోషంగా ఉన్నది. ఇంటి పనికి అవసరమయ్యే మరిన్ని పరికరాలను రూపొందించాలని అనుకుంటున్నాను.