పూర్వజన్మ సంస్కారముల ప్రేరణతో యోగిగా మారాడు ఓ డిప్లొమా ఇంజినీర్. ఉద్యోగానికి రాజీనామా చేసి 21 ఏండ్లుగా ఆశ్రమ జీవితాన్ని గడుపుతున్నారు. లోకకల్యాణార్థం, ధర్మరక్షణ కోసం 17వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువతలో ఆధ్యాత్మిక భావన పెంపొందాలన్న సత్సంకల్పంతో పుస్తకాలు సైతం రాశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని విఠలేశ్వర గుహలో భగవద్గీత పారాయణం, యోగా సాధన చేయిస్తూ విద్యార్థులు, యువకులకు జ్ఞానాన్ని అందిస్తున్నారు స్వామి సర్వేశ్వరానంద ఉదాసీన.
నవీపేట, సెప్టెంబర్ 11: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలోని పాదిరివేడు గ్రామంలో సర్వేశ్వరానంద ఉదాసీన 1961లో జన్మించారు. 1980లో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, ఎనిమిదేండ్ల పాటు ఇంజినీర్‌గా ఉద్యోగం చేశాడు. పూర్వ జన్మ సంస్కారముల ప్రేరేపణతో యోగిగా మారారు. మూడేండ్ల క్రితం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం విఠలేశ్వర ఆలయ గుహలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని లోక కల్యాణార్థం యువతలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తున్నారు.
అతనొక డిప్లొమా ఇంజినీర్. ఎనిమిదేండ్ల పాటు ఇంజినీర్‌గా ఉద్యోగం చేశాడు. పూర్వ జన్మ సంస్కారముల ప్రేరేపణతో యోగిగా మారారు. లోక కల్యాణార్థం దేశ ప్రజలు, యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు 50కి పైగా పుస్తకాలు రాశాడు. విద్యార్థులు, యువకులతో నిత్యం యోగా సాధనతోపాటు భగవద్గీత పారాయణం చేయిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు స్వామి సర్వేశ్వరానంద ఉదాసీన.
75 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం..
యోగి ఉదాసీన మాతృదేశంపై భక్తితో 75 ఛందస్సుల్లో రచించిన స్వతంత్ర అమృతోత్సవ భారతి, 75 వేల పుస్తకాలను స్థానిక సర్పంచ్ లహరితో కలిసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డితోపాటు నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ చేతుల మీదుగా 20వేల పుస్తకాలను పంపిణీ చేయించారు.
భారత ఉపరాష్ట్రపతి ప్రశంసలు..
విశిష్ట యోగి స్వామి సర్వేశ్వరానంద ఉదాసీన దేశభక్తిని చాటి చెబుతూ తెలుగులో రచించిన స్వతంత్ర అమృతోత్సవ భారతి పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి పోస్టు ద్వారా పంపించారు. పుస్తకాన్ని చదివిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రచయిత ఉదాసీనను అభినందిస్తూ ప్రత్యుత్తరం పంపించారు.
సనాతన ధర్మాన్ని కాపాడేందుకే..
సనాతన ధర్మాన్ని కాపాడేందుకే వివిధ భాషల్లో 50 పుస్తకాలను రచించాను. ప్రతి ఇంటా భగవద్గీత పారాయణం చేయాలి. నిత్యం విద్యార్థులకు, గ్రామస్తులకు యోగా సాధనతో పాటు భగవద్గీత పారాయణం చేయిస్తున్నాను. భగవద్గీత పఠనంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది.
17 వేల కిలోమీటర్ల పాదయాత్ర
2001 సంవత్సరంలో దేశంలోని 24 రాష్ర్టాల మీదుగా 17వేల కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేశారు. ఈ ప్రాంతంలో ఉత్తర, దక్షిణ దిశల్లో ప్రవహించే వేగావతి నది, తూర్పు దిశలో ఉన్న మల్లికార్జునాలయం కాశీని పోలి ఉండడంతో అక్కడే ప్రజలకు భక్తి భావాలను చాటి చెప్పి అనంతరం నవీపేట మండలంలోని యంచ గోదావరి నది తీరాన ఎత్తైన గుట్టమీద ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం ధ్యానంతోపాటు మూడేండ్లలో 11 సాహిత్య సర్వస్వాలను తెలుగు, తమిళం, ఆంగ్లం, హిందీ, సంస్కృత భాషల్లో రచించారు. ఇటీవల తెలుగులో రచించిన స్వతంత్ర అమృతోత్సవ భారతి అనే పుస్తకాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.