ఉమ్మడి జిల్లాలో సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రకు ఘన స్వాగతం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీకి బయల్దేరిన 21మంది..
బృందంలో కాళ్లు లేని ఇద్దరు జవాన్లు
డిచ్పల్లి, సెప్టెంబర్ 11: దేశ రక్షణలో సీఆర్పీఎఫ్ సేవలు కీలకమని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 21 మందితో కూడిన సీఆర్పీఎఫ్ జవాన్లు తలపెట్టిన సైకిల్ ర్యాలీ నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని చాంద్రాయన్పల్లికి శుక్రవారం చే రుకున్నది. యాత్రకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, ఏడో బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సత్య శ్రీనివాస్‌రావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా 2,850 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టడం గొప్పవిషయమని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కాలు పోగొట్టుకున్న ఇద్దరు జవాన్లు కూడా సైకిల్ యాత్రలో పాల్గొన డం అద్వితీయమని కొనియాడారు. రూరల్ ఎమ్మెల్యే గోవర్ధన్ మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు తాను పోలీసుల సహకారంతోనే ప్రాణాలతో బయటపడ్డానని గుర్తుచేసుకున్నా రు. సైకిల్‌యాత్ర ప్రశాంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఏడో బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. డిచ్పల్లిలోని ఓ ప్రైవేటు గార్డెన్లో పోలీసు కళాబృందం, మానవతా సదన్ చిన్నారులు, సమాచార, సాంస్కృతిక శాఖ, ఇతర విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. డిచ్‌పల్లిలో బసచేసి శనివారం ఉదయం యాత్రను ప్రారంభించిన జవాన్లకు కమాండెంట్ వీడ్కోలు పలికారు. కార్యక్రమాల్లో సీఆర్పీఎఫ్ కమాండెంట్ విద్యాధర్, సైక్లిస్ట్ కమాండెంట్ జేవీ శర్మ, రెండో కమాండెంట్ దినేశ్‌కుమార్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ ఎన్వీరావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రావు, ఆర్డీవో రవి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, తహసీల్దార్లు శ్రీనివాస్‌రావు, రమేశ్, డిప్యూటీ సీఈవో మర్రి సురేందర్, జడ్పీటీసీ జగన్, ఎంపీపీ రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, సీఐలు శ్రీశైలం, రఘునాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శేఖర్, శైలేందర్, ఎస్సైలు గౌరేందర్గౌడ్, బి.ఆంజనేయులు, సర్పంచ్ చింతకింది లలితా గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రకు ఘన స్వాగతం..
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 11: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ అధికారులు కన్యాకుమారి నుంచి రాజ్‌ఘాట్ వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం కామారెడ్డి జిల్లాకు చేరుకున్నది. వారికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్వేతారెడ్డి ఘన స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, పట్టణ డీఎస్పీ సోమనాథం తదితరులు వారికి పూలమాలలు వేసి సత్కరించారు. ర్యాలీలో ఛత్తీస్‌గడ్‌లో ఉగ్రవాదులు బాంబు పేల్చడంతో కుడికాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ అజయ్, హెడ్ కానిస్టేబుల్ కృష్ణకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కేఎస్ రాములు అనే జవాన్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య బాలమణిని కలెక్టర్, ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు సన్మానించారు.