చేపలను దిగుమతి చేసుకునే అవసరం తెలంగాణకు లేకుండా పోయింది..
జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 4.3 కోట్ల చేపపిల్లలను విడుదల చేస్తున్నాం
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి
ఎస్సారెస్పీలో 62లక్షల చేపపిల్లల విడుదల
బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి శంకుస్థాపన
బాల్కొండ(ముప్కాల్), సెప్టెంబర్ 8: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వ కృషి చేస్తున్నదని, ఇందుకోసం ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగాపూర్‌లోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి ఆయన మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లపై ఆధారపడిన బెస్త, గూండ్ల కులస్తులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉచిత చేప పిల్లల పంపిణీ ఎంతగానో తోడ్పడుతున్నదని అన్నారు. ఇప్పుడు ఊరూరా చేపలు లభిస్తున్నాయని చెప్పారు. గతంలో ఆంధ్ర నుంచి చేపలను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడు తెలంగాణలోనే విరివిగా చేపలు లభిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలోని 896 చెరువులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మొత్తం రూ.4కోట్ల30 లక్షల విలువైన చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీలో 62లక్షల చేపపిల్లలను మంగళవారం విడుదల చేశామన్నారు. మత్స్యకారులకు వలలు, మోపెడ్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాల్కొండ సర్పంచ్ బూస సునీత నరహరి, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేశ్, ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, టీఆర్ఎస్ నేత తౌటు గంగాధర్, ఎంపీటీసీలు కన్న లింగవ్వ, పోశెట్టి, మామిడి దివ్య రాకేశ్, ఏనుగుల రాంరాజ్గౌడ్, నీరడిలతాగంగారాం, మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉపసర్పంచ్ షేక్ వాహబ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ముస్కు భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే వేదికలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఆయన బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం వీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అందరి సమస్యలను పరిష్కరించే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా క్యాంపు కార్యాలయం పరిష్కారానికి వేదికగా ఉంటుందన్నారు. రూ.కోటీ 90 లక్షలతో క్యాంపు కార్యాలయ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం కిసాన్‌నగర్‌లో సీనియర్ సిటిజన్స్ ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహదాత సాగర్‌రెడ్డిని సత్కరించారు. బస్టాండ్ ఆవరణలో మొక్కను నాటారు.