మోర్తాడ్, అక్టోబర్ 7: ఎటు చూసినా కనిపించే పచ్చదనం మనిషి అవసరాలకు కనిపించకుండాపోతోంది. మళ్లీ పచ్చదనం పెంపొందించుకొని, ఆహ్లాదం తిరిగి సాధించాలని ఆ యువకుడు కలలు కన్నాడు. విదేశాల్లో ఉంటూ తిరిగి గ్రామంలో పచ్చదనం నింపాలని నిర్ణయించుకున్నాడు. గ్రామం హరిత శోభను సంతరించుకోవడానికి 2017లో శ్రీకారం చుట్టాడు పాలెం గ్రామానికి చెందిన రాజశేఖర్. నెదర్లాండ్స్లో ఉంటూ 2020 ఫిబ్రవరి వరకు కూడా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకున్నాడు. చిన్నప్పుడు చూసిన పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం రావాలనే తపనతో తనవంతు ప్రయత్నం చేసి ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచాడు.
మొక్కలు నాటేందుకు రూ.5 లక్షల ఖర్చు..
పాలెంను హరితగ్రామంగా మార్చేందుకు రాజశేఖర్ ఇప్ప టి వరకు మొక్కలు నాటే కార్యక్రమానికి దాదాపు రూ.5లక్షల వరకు ఖర్చు చేశాడు. గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రెండేండ్లపాటుమొక్కలను పెంచి గ్రామం లో నాటించే వాడు. వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేయించేవాడు. ప్రతిరోజూ మొక్కలకు నీరు పోసేందుకు ఆటోను కూడా కొనుగోలు చేసి, ఓ వ్యక్తిని నియమించి నెలకు రూ. 6వేల వేతనాన్ని ఇచ్చి మొక్కలకు నీళ్లు పోయించేవాడు. ఇప్పటి వరకు గ్రామంలోని ఆలయాల వద్ద, శ్మశానవాటిక, రోడ్ల వెంట దాదాపుగా మూడు వేల మొక్కల వరకు నాటించాడు. రెంజర్ల, శెట్పల్లి, ఆర్మూర్ తదితర ప్రాం తాల్లో దాదాపు రెండు వేల మొక్కలను నాటించాడు. విదేశాల్లో ఉన్నా నాటించిన మొక్కలు ఏవిధంగా ఉన్నాయని తెలుసుకునే వాడు. తరచూ గ్రామంలోని మిత్రులకు ఫో న్ చేసి మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేవా డు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేయడం, విదేశాల నుంచి వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాడు.
ఆహ్లాదకర వాతావరణం కోసం
గ్రామం కోసం నావంతుగా ఏదైనా చేయాలని మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టా ను. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు సహకారాన్ని అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. పొలాల్లో గడ్డిని తగలబెట్టడంతో నేను నాటించిన మొక్కలు కాలిపోయాయని తెలిసి బాధపడ్డాను. నాటించిన మొక్కలను తొలగించడం ఇబ్బంది అనిపించింది. విదేశాల నుంచి రావడం కుదరక ప్రస్తుతం ఈకార్యక్రమానికి దూరంగా ఉన్నా.. భవిష్యత్తులో తిరిగి ఈకార్యక్రమాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.