చర్చి నిర్మాణానికి తవ్విన గుంతలో పడి ఇద్దరు మృతి
నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో ఘటన
నాగిరెడ్డిపెట్, సెప్టెంబర్ 5: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం గ్రామంలో విషాదం నెలకొంది. చర్చి నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో బయట ఆడుకుంటున్న చిన్నారులు (హనిల్సన్, జయశ్రీ)గుంతలో పడి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆదివారం గ్రామంలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. ఫాదర్‌గా విధులు నిర్వహిస్తున్న దీపక్డొలాన్సన్ కుమారుడు హనిల్సన్ (4), లింగంపేట్ మండంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన సాయిలు కూతురు జయశ్రీ అలియాస్ గ్రేసీ ( 4) బయట ఇసుకలో ఆడుకుంటున్నారు. ప్రార్థనలు ముగించుకుని పిల్లల కోసం వెతకగా కనిపించలేదు. చిన్నారుల చెప్పులు పిల్లర్ కోసం తవ్విన గుంత వద్ద కనిపించడంతో అనుమానించిన తల్లిదండ్రులు గుంతలోకి తొంగి చూడగా చిన్నారులు కనిపించారు. వెంటనే వారిని బయటికి తీయగా మృతి చెంది ఉన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సయ్యద్ అహ్మద్, ఎస్సై ఆంజనేయు లు సంఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నారు. మృతదేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
రెండు కుటుంబాల్లో విషాదం
ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన దీపక్డొలాన్సన్ ( చర్చి ఫాదర్) మండంలోని పోచారం గ్రామంలో ఉంటూ శెట్పల్లి సంగారెడ్డి, పోచారం, పర్మళ్ల గ్రామాల్లో చర్చిలో పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో తండ్రి దీపక్డొలాన్సన్, తల్లి సంధ్య కన్నీరుమున్నీరయ్యారు.లింగంపేట్ మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన సాయిలుకు పోచారం గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. కొన్ని రోజులుగారోజులుగా జ్యోతి పోచారంలోనే ఉండడంతో అక్కడే చర్చిలో ప్రార్థనకు వెళ్తున్నారు.జ్యోతి-సాయిలుకు ఇద్దరు పిల్లలు కాగా చిన్న కూతురు గ్రేసీ మృతి చెందింది.