కామారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల తన పర్యటనలో వైద్యకళాశాలను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ దిశగా కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు కూడా వెలువడ్డాయి. కళాశాల ఏర్పాటుకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్లో 40 ఎకరాలు అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ భూములకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కామారెడ్డి, సెప్టెంబర్ 30: ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తోంది. ఒక్కో జిల్లాలో వైద్యకళాశాలను ప్రారంభించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నది. రెండేండ్ల వ్యవధిలో రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనుండగా మొత్తం 1800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మొదటి ఏడాది ఎనిమిది కళాశాలల ఏర్పాటు కానుండగా, ఆ తరువాత కామారెడ్డితోపాటు మూడు జిల్లాల్లో మరో మూడు కళాశాలలు రానున్నాయి. కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో వసతులు, భూములు, అనుబంధ దవాఖానలను గుర్తించాలని వైద్య ఆరోగ్యశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కళాశాలల ఏర్పాటు విషయమై జాతీయ వైద్య కమిషన్‌కు ప్రతిపాదనలు చేశా రు. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలపై కదలిక మొదలైంది.
కామారెడ్డిలో కళాశాల కోసం భూసేకరణ
వైద్య ఆరోగ్యశాఖపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కొత్త కళాశాలల ఏర్పాటుపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా భూసేకరణతోపాటు వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల విషయంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను ఆదేశించారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో నివేదిక సిద్ధం చేయాలని సూచించడంతో కసరత్తును ప్రారంభించారు. మెడికల్ కళాశాల ప్రారంభించాలంటే దానికి అనుబంధంగా 330 పడకల దవాఖాన ఉండాలి. పడకల సంఖ్య పెంచడానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. కొత్త పడకలు, ఇతర పరికరాల విషయంలో త్వరలో చర్యలు చేపట్టనున్నారు. కొత్త మెడికల్ కళాశాలల విషయంలో భూములు ఉండగా, 330 పడకల దవాఖాన ఒక్క సంగారెడ్డిలో మాత్రమే ఉంది. మిగితా ప్రాంతాల్లో మాత్రం 100 నుంచి 200 పడకల లోపు అనుబంధ దవాఖానలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డిలో వంద పడకల దవాఖాన ఉండగా, మరో వంద పడకల మాతా శిశు కేంద్రం నిర్మాణంలో ఉంది. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం 40 ఎకరాల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన భూములు ఉన్నట్లు గుర్తించి ప్రతిపాదనలు రూపొందించడానికి సిద్ధమయ్యారు. వసతులు, భూములు, దవాఖానలు లేని చోట ఎంతమేరకు నిధులు కావాల్సి వస్తాయో ప్రతిపాదనలు చేయాలని సీఎంవో నుంచి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు వచ్చాయి.
ఆచరణలోకి ప్రభుత్వ విప్ గంప, కేసీఆర్ హామీలు
కామారెడ్డి కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో కదలిక వచ్చింది. మెడికల్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విజ్ఞప్తితో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలో నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు ముఖ్య కూడలిగా అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రాల్లో కామారెడ్డి ఒకటి. వ్యాపార, వాణిజ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎడ్యుకేషన్ హబ్ మం జూరు చేస్తానన్న మాటకు కట్టుబడిన సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీం తో కామారెడ్డి ప్రాంత వాసుల కల త్వరలో నెరవేరబోతున్నది.
పెరగనున్న కళాశాలల సంఖ్య
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 మెడికల్ కళాశాలలు ఉండగా.. వచ్చే రెండేండ్ల వ్యవధిలో 12 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఆరోగ్యశాఖను కూడా సీఎం కేసీఆర్ చూస్తుండడంతో పనులు చకచకా సాగుతున్నాయి.
భూసేకరణ చేయాలని ఆదేశాలు
కామారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కళాశాల ఏర్పాటు విషయమై భూమి సేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం డిగ్రీ కళాశాలలో 30నుంచి 40 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాం. కామారెడ్డి ప్రాంత వాసుల కోరిక మేరకు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. మెడికల్ కళాశాలతో కామారెడ్డి జిల్లా వాసులకు నాణ్యమైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.