స్వల్పంగా పెరుగుతున్న కేసులు
దోమల నివారణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి
పరిశుభ్రతే ప్రథమ చికిత్స : వైద్యులు
ఖలీల్‌వాడి, ఆగస్టు 31: నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు వెలుగుచూస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. రెండేండ్ల క్రితం కొవిడ్ మహమ్మారి మాదిరిగా డెంగీ విజృంభించింది. కొందరు ఈ వ్యాధిన బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించడంతో కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు కరోనా వైరస్ విజృంభించడంతో పరిశుభ్రతే ప్రథమ చికిత్సగా ప్రతి ఒక్కరూ పాటించారు. కరోనా కారణంతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన మరింత పెరిగింది. దీంతో రెండేండ్లుగా డెంగీ కేసులు అతి తక్కువగా నమోదుకావడం గమనార్హం. హెడీస్ ఈజిప్టీ (టైగర్ దోమ) జాతికి చెందిన ఈ దోమలు డెంగీ వైరస్‌ను కలిగి ఉన్నాయి. 2019లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈసారి వర్షాలు విస్తారంగా కురవడంతో ఎక్కువగా మురికి కుంటల్లో నీరుచేరి నిల్వ ఉంటుంది. దీంతో డెంగీ లార్వాతో దోమలు వృద్ధి చెంది పంజా విసురుతున్నాయి. వర్షాకాలంలో 40 ఏండ్లు దాటిన వారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూ చిస్తున్నారు. చాలా మంది రోగనిరోధక శక్తి తగ్గి జ్వరాల బారిన పడుతున్నారు. తెల్ల రక్తకణాలు తగ్గి తీవ్ర అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇంటింటి సర్వేతో పాటు ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. టైగర్ దోమ ఎక్కడెక్కడ దాగి ఉంటుం దో ఆ పరిసరాల ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్‌తో నివారించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ చెడిపోయిన కూలర్లు, పూలకుండీలు, నీటి కుండీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడంతోపాటు ఇంట్లో పనికి రాని వస్తువులను బయట ఉంచకుండా మున్సిపల్ వాహనదారులకు అందజేయాలని సిబ్బంది సూచిస్తున్నారు. 2019లో 590 కేసులు, 2020లో 58, 2021లో ఇప్పటి వరకు 88 కేసులు నమోదయ్యాయి.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం
జిల్లాలోని అన్ని మండల, గ్రామ, పట్టణాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటున్నాం. ఇండ్ల పరిసరాలు, ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు అవగాహన కల్పిస్తున్నాం. మురికి నీరు ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేసి నివారణ చర్యలు తీసుకుంటున్నాం.
తుకారాం రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో,జిల్లా మలేరియా నివారణ అధికారి
వ్యక్తిగత పరిశుభ్రత అవసరం
వ్యక్తిగత పరిశుభ్రత అందరికీ అవసరం. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో పది మంది డెంగీ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతే ప్రథమ చికిత్సగా భావించాలి. కరోనా వైరస్ నియంత్రణ మాదిరిగానే పటిష్టమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్నది. దవాఖానలో అన్ని వసతులు సిద్ధంగా ఉన్నాయి.