పెద్ద కొడప్ గల్ (పిట్లం), ఏప్రిల్ 18: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సిద్ధాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల పోలీస్ స్టేషస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే బుచ్చయ్య చారి గురువారం తన విధులు ముగించుకుని పిట్లం నుండి బాన్సువాడకు తన బైక్ పైన వెళ్తున్నాడు.
ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో పిట్లం మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద రోడ్డు పక్కన గల ఈత చెట్టుకు ఢీకొని చాతికి, తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. బుచ్చయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.